10 days to go: ఐపీఎల్ 2026కి కౌంట్‌డౌన్..ఆకట్టుకునేందుకు సిద్ధమైన 10 మంది కొత్త ఆటగాళ్లు ఎవరంటే
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మరోసారి రాబోతోంది. మార్చి 28 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2026 సీజన్ మరింత ఉత్కంఠగా ఉండబోతోందని అంచనా. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా కొత్త ఆటగాళ్లు తమ ప్రతిభతో అందరినీ ఆకట్టుకునే అవకాశం ఉంది. జట్లు తమ స్క్వాడ్లలో చేసిన మార్పులతో పోటీ మరింత కఠినంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో తొలి సారి రంగంలోకి దిగుతున్న కొందరు కొత్త ఆటగాళ్లు ప్రత్యేకంగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. మరి వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం.
వివరాలు
బరిలోకి దిగేది వీళ్లే..
మధ్యప్రదేశ్‌కు చెందిన ఎడమచేతి పేసర్ మంగేష్ యాదవ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.5.2 కోట్లకు కొనుగోలు చేసింది. యార్కర్లతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే ఈ యువ బౌలర్ గత ఏడాది మంచి ప్రదర్శనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కూపర్ కానోలీని పంజాబ్ కింగ్స్ రూ.3 కోట్లకు దక్కించుకుంది. బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్ రెండింట్లోనూ జట్టుకు ఉపయోగపడగల సామర్థ్యం అతనికి ఉంది. వికెట్‌కీపర్, బ్యాటర్ తేజస్వి సింగ్ దహియాను కోల్ కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. తక్కువ మ్యాచ్‌లు ఆడినప్పటికీ మంచి స్ట్రైక్‌రేట్‌తో తేజస్వి సింగ్ దహియా ఆకట్టుకున్నాడు.
వివరాలు
సత్తా చాటేందుకు సిద్ధమైన ఆటగాళ్లు..
శ్రీలంక స్టార్ ఓపెనర్ పతుమ్ నిస్సాంకాను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.4 కోట్లకు సొంతం చేసుకుంది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లో అతని స్థిరమైన ప్రదర్శనలు జట్ల దృష్టిని ఆకర్షించాయి. జమ్మూ కశ్మీర్‌కు చెందిన పేసర్ ఆకిబ్ నబీని కూడా ఢిల్లీ క్యాపిటల్స్ భారీగా రూ.8.4 కోట్లకు కొనుగోలు చేసింది. దేశీయ క్రికెట్‌లో అద్భుత ఫామ్‌తో అతను ప్రత్యేక గుర్తింపు పొందాడు. రాజస్థాన్‌కు చెందిన యువ పేసర్ అశోక్ శర్మను గుజరాత్ టైటాన్స్ రూ.90 లక్షలకు దక్కించుకుంది. 140 కి.మీ వేగంతో బౌలింగ్ చేసే అతని సామర్థ్యం జట్టుకు బలం కావొచ్చు. న్యూజిలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.2 కోట్లకు తీసుకుంది. ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో అతని ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది.
వివరాలు
అదరగొడతారా..బెదరగొడతారా?
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ జట్టుకు ఉపయోగపడే సామర్థ్యం అతనిలో ఉంది. యువ వికెట్‌కీపర్ కార్తిక్ శర్మను చెన్నై సూపర్ కింగ్స్ భారీగా రూ.14.2 కోట్లకు కొనుగోలు చేయడం సంచలనం సృష్టించింది. తక్కువ మ్యాచ్‌ల్లోనే మంచి స్ట్రైక్‌రేట్‌తో ఆకట్టుకున్నాడు. ఇక మరో యువ ఆటగాడు ప్రశాంత్ వీర్‌ను కూడా సీఎస్‌కే రూ.14.2 కోట్లకు తీసుకుంది. ఎడమచేతి స్పిన్నర్ అయిన వీర్ భవిష్యత్తులో కీలక ఆటగాడిగా మారే అవకాశముంది. మొత్తంగా చూస్తే, ఈసారి ఐపీఎల్‌లో కొత్త ఆటగాళ్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ యువ క్రికెటర్లు తమ ప్రతిభతో ఈ సీజన్‌ను మరింత రసవత్తరంగా మార్చే అవకాశం ఉంది.