3 days for IPL: మరో 3 రోజుల్లో ఐపీఎల్.. ఈ సీజన్‌ను శాసించే కెప్టెన్లు వీరే!
ఈ వార్తాకథనం ఏంటి
అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్ వస్తే చాలు..ఇక అందరూ టీవీలకు, మొబైల్స్‌కు అతుక్కుపోవాల్సిందే. మరి ఈసారి ఐపీఎల్‌లో మొత్తం 10 జట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. ఈసారి పోటీ మామూలుగా ఉండదు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఆటగాళ్లు ఈ టోర్నీలో ఆడనుండగా, జట్ల కెప్టెన్లు ముందుండి నడిపించడం కీలకం. ఈ నేపథ్యంలో ఈ ఐపీఎల్ సీజన్‌ను శాసించగల ముగ్గురు కెప్టెన్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వివరాలు
శ్రేయస్ అయ్యర్ - పంజాబ్ కింగ్స్
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గత సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఓడిపోయినా, అయ్యర్ బ్యాటింగ్‌తో సత్తా చాటాడు. మొత్తం 604 పరుగులు చేసి 50.33 సగటు నమోదు చేశాడు. శ్రేయస్ అయ్యర్ స్ట్రైక్‌రేట్ 175.07గా ఉండటం విశేషం. ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ శ్రేయస్ అయ్యర్.. 87 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి 55.17 శాతం విజయాలు సాధించాడు.
వివరాలు
హార్దిక్ పాండ్యా - ముంబై ఇండియన్స్
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టి20 ఫార్మాట్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడు. 2022లో గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్ అందించిన అనుభవం అతనికి ఉంది. ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో 2,749 పరుగులు, 78 వికెట్లు సాధించి తన సామర్థ్యాన్ని చాటుకున్నాడు. కెప్టెన్‌గా 60 మ్యాచ్‌ల్లో 58.33 శాతం విజయాలు సాధించాడు.
వివరాలు
శుభ్‌మన్ గిల్ - గుజరాత్ టైటాన్స్
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ సీజన్‌లో భారీ ప్రదర్శన చేయాలని చూస్తున్నాడు. 2022 నుంచి ఇప్పటివరకు ఐపీఎల్‌లో 2,449 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ కాలంలో అతని సగటు 46.2గా ఉంది. 2023 సీజన్‌లో 890 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. కెప్టెన్‌గా 14 విజయాలు, 13 పరాజయాలతో మంచి రికార్డు కలిగి ఉన్నాడు. ఈసారి ఐపీఎల్‌లో ఈ ముగ్గురు కెప్టెన్లు తమ ప్రదర్శనతో జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.