Rashid Khan: ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త రికార్డు.. 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రషీద్!
ఈ వార్తాకథనం ఏంటి
అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్‌లో తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టే ఈ స్టార్ బౌలర్.. అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 200వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ఘనత సాధించాడు. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఓ వికెట్ పడగొట్టడం ద్వారా ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. రషీద్ ఖాన్ కేవలం 120 ఇన్నింగ్స్‌ల్లోనే 200 వికెట్ల ఘనతను అందుకోవడం విశేషం. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్‌గానూ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు అతడి ఖాతాలో రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి.
వివరాలు
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
ఈ ఫార్మాట్‌లో 3 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం అతడి అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలుగా ఉన్నాయి.
రషీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్) - 120 ఇన్నింగ్స్‌ల్లో 200 వికెట్లు
ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్) - 146 ఇన్నింగ్స్‌ల్లో 171 వికెట్లు
ఎహ్సాన్ ఖాన్ (హాంకాంగ్) - 116 ఇన్నింగ్స్‌ల్లో 165 వికెట్లు
ఇష్ సోధి (న్యూజిలాండ్) - 135 ఇన్నింగ్స్‌ల్లో 165 వికెట్లు
టిమ్ సౌథీ (న్యూజిలాండ్) - 123 ఇన్నింగ్స్‌ల్లో 164 వికెట్లు
వివరాలు
ఓవరాల్ టీ20ల్లోనూ రషీద్ ఖాన్‌దే అగ్రస్థానం!
అంతర్జాతీయ టీ20లతో పాటు ఓవరాల్ టీ20 క్రికెట్‌లోనూ రషీద్ ఖాన్ వికెట్ల వేట కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అతడు అగ్రస్థానంలో ఉన్నాడు.
ఇప్పటివరకు 551 మ్యాచ్‌లు ఆడి 742 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
అతడు 617 మ్యాచ్‌ల్లో 658 వికెట్లు పడగొట్టాడు. మరో విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో 582 మ్యాచ్‌ల్లో 631 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
దక్షిణాఫ్రికా బౌలర్ ఇమ్రాన్ తాహిర్ 593 వికెట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ 540 వికెట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.
వివరాలు
జింబాబ్వేపై అఫ్గానిస్థాన్ ఘన విజయం.. ఒమర్‌జయ్, రజా సెంచరీలు!
షార్జా వేదికగా జరిగిన రెండో టీ20లో అఫ్గానిస్థాన్ 19 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఆ జట్టు బ్యాటర్ అజ్మతుల్లా ఒమర్‌జయ్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. కేవలం 50 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేశాడు.
అతడికి తోడుగా ఇయాస్ అహ్మద్ కూడా బ్యాట్ ఝుళిపించాడు. 27 బంతుల్లోనే 52 పరుగులతో అర్ధసెంచరీ సాధించాడు.
ఇక చివర్లో రషీద్ ఖాన్ కూడా తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. కేవలం 6 బంతులు ఎదుర్కొని 4 సిక్సర్లతో 25 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
వివరాలు
బ్యాటింగ్ లోనూ రాణించిన రషీద్ ఖాన్
జింబాబ్వే బౌలర్లలో కుందయ్ మటిగిము, బ్రాడ్ ఎవాన్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులకే పరిమితమైంది.
ఆ జట్టు కెప్టెన్ సికందర్ రజా ఒంటరి పోరాటం చేశాడు. 56 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
తఫాద్జ్వా త్సిగా 31 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. మిగతా బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.
అఫ్గానిస్థాన్ బౌలర్లలో అబ్దుల్లా అహ్మద్‌జయ్ రెండు వికెట్లు తీశాడు. ఫరీద్ అహ్మద్, అజ్మతుల్లా ఒమర్‌జయ్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. దీంతో అఫ్గానిస్థాన్ 19 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.