Rajat Patidar: 41 బంతుల్లోనే సెంచరీ.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రజత్ పాటిదార్ విధ్వంసం!
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పాటిదార్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ఇన్నింగ్స్‌తో చరిత్ర సృష్టించాడు. మధ్యప్రదేశ్ తరఫున ఆడుతున్న అతడు.. అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 13 సిక్సర్లతో 135 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 281.25 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన పాటిదార్.. కేవలం 41 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.
వివరాలు
57 పరుగులకే 3 వికెట్లు.. అక్కడి నుంచి విధ్వంసం
న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ జట్టు 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆ సమయంలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రజత్ పాటిదార్ అస్సాం బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మైదానం నలుమూలలా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
అతడి మెరుపు బ్యాటింగ్ కారణంగా మధ్యప్రదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 250 పరుగుల భారీ స్కోరు సాధించింది.
వివరాలు
మధ్యప్రదేశ్ తరఫున తొలి సెంచరీ
ఈ శతకంతో రజత్ పాటిదార్ తన పాత రికార్డును తానే బద్దలు కొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో మధ్యప్రదేశ్ తరఫున సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు.
గతంలో 2021లో గోవాపై 96 పరుగులు, 2022లో రైల్వేస్‌పై 92 పరుగులు చేసి సెంచరీకి చేరువగా వచ్చాడు.
అయితే ఆ రెండు సందర్భాల్లోనూ మూడంకెల స్కోరును అందుకోలేకపోయాడు. తాజాగా అస్సాంపై శతకం బాది ఆ లోటును భర్తీ చేసుకున్నాడు.
వివరాలు
టీ20లపైనే దృష్టి.. 50 ఓవర్ల టోర్నీకి దూరం
ఇటీవల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నమెంట్‌కు ఎంపికైనప్పటికీ.. పాటిదార్ ఆ టోర్నీ నుంచి తప్పుకున్నాడు.
50 ఓవర్ల క్రికెట్ ఆడేందుకు తన శరీరం పూర్తిగా సహకరించడం లేదని, అందుకే కేవలం టీ20 క్రికెట్‌పైనే దృష్టి సారిస్తున్నానని స్పష్టం చేశాడు.
ప్రస్తుతం మధ్యప్రదేశ్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పాటిదార్.. ఈ తుఫాన్ ఇన్నింగ్స్‌తో టీ20 ఫార్మాట్‌లో తానెంత ప్రమాదకరమైన ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు.