Loading...
Yashasvi Jaiswal: 119 బంతుల్లో సెంచరీ.. కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన జైస్వాల్!
119 బంతుల్లో సెంచరీ.. కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన జైస్వాల్!

Yashasvi Jaiswal: 119 బంతుల్లో సెంచరీ.. కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన జైస్వాల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 03, 2026
09:21 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. న్యూజిలాండ్‌-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత రెండో ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీతో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో విఫలమైన జైస్వాల్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అద్భుతంగా పుంజుకున్నాడు. క్రీజులో నిలకడగా ఆడుతూ కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. కేవలం 119 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అతడి ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో ఇది 18వ సెంచరీ కావడం విశేషం. టీ విరామ సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 51 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 159 బంతుల్లో 153 పరుగులతో అజేయంగా కొనసాగుతున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.

వివరాలు

11 పరుగులకే వెనుతిరిగిన సాయి సుదర్శన్

మరోవైపు యశ్ రాథోడ్ 115 బంతుల్లో 89 పరుగులతో క్రీజులో ఉన్నాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ప్రస్తుతం భారత జట్టు 191 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా-ఏ బ్యాటర్లు దూకుడుగా ఆడటం మరో విశేషం.

ఓవర్‌కు 5.27 పరుగుల రన్‌రేట్‌తో పరుగులు సాధించారు. అయితే మరో ఓపెనర్ సాయి సుదర్శన్ కేవలం 11 పరుగులకే పెవిలియన్ చేరాడు.

తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న దేవదత్ పడిక్కల్ రెండో ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.

న్యూజిలాండ్ బౌలర్లలో బ్రెట్ రాండెల్, జర్రోడ్ మెక్‌కే చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు న్యూజిలాండ్-ఏ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 424 పరుగులకు ఆలౌటైంది.

వివరాలు

ఐదు వికెట్లు పడగొట్టిన ముకేష్ కుమార్

ఆ జట్టు బ్యాటర్ మాథ్యూ బొలె 110 పరుగులతో సెంచరీ సాధించగా.. డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ 93 పరుగులు చేసి శతకానికి ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.

భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లతో ప్రత్యర్థి జట్టు పతనంలో కీలక పాత్ర పోషించాడు.

ఇక అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 346 పరుగులకు ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 424 పరుగులు చేయడంతో భారత్‌పై ఆధిక్యం సాధించింది.

అయితే రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్, యశ్ రాథోడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో టీమిండియా పుంజుకుంది. ముఖ్యంగా జైస్వాల్ అజేయ శతకంతో జట్టుకు కీలక ఆధిక్యాన్ని అందించే దిశగా సాగుతున్నాడు.

ADVERTISEMENT