Loading...
Anuj Shrivastava: భారత చెస్‌లో చారిత్రక ఘనత.. 100వ గ్రాండ్‌మాస్టర్‌గా అనుజ్ శ్రీవత్రి!
భారత చెస్‌లో చారిత్రక ఘనత.. 100వ గ్రాండ్‌మాస్టర్‌గా అనుజ్ శ్రీవత్రి!

Anuj Shrivastava: భారత చెస్‌లో చారిత్రక ఘనత.. 100వ గ్రాండ్‌మాస్టర్‌గా అనుజ్ శ్రీవత్రి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2026
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత చదరంగ చరిత్రలో మరో కీలక మైలురాయి నమోదైంది. మధ్యప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల అనుజ్ శ్రీవత్రి దేశ 100వ చెస్ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు. ఫిలిప్పీన్స్‌లో ఆదివారం ముగిసిన 7వ ఏషియన్ ప్లస్ ఇండివిడ్యువల్ ఓపెన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి ఈ అరుదైన ఘనత సాధించాడు. దీంతో మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన తొలి ఆటగాడిగా కూడా అనుజ్ రికార్డు సృష్టించాడు.

వివరాలు

9 గేమ్‌లలో 7 పాయింట్లు.. అగ్రస్థానంలో అనుజ్

ఈ టోర్నమెంట్‌లో విజేతకు నేరుగా గ్రాండ్‌మాస్టర్ టైటిల్ అందించేందుకు అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ప్రత్యేక అనుమతి ఇచ్చింది.

దీంతో సాధారణంగా గ్రాండ్‌మాస్టర్ హోదా కోసం అవసరమయ్యే మూడు జీఎం నార్మ్‌లు, 2500 ఎలో రేటింగ్ నిబంధనలను పూర్తి చేయకుండానే అనుజ్ ఈ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

టోర్నీలో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన అనుజ్.. తొలి గేమ్‌లో ఓటమి ఎదురైనా అద్భుతంగా పుంజుకున్నాడు. ఆ తర్వాత నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

మొత్తం 9 గేమ్‌లలో 7 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. తద్వారా భారత 100వ గ్రాండ్‌మాస్టర్‌గా చరిత్ర సృష్టించాడు.

వివరాలు

1988లో ఆనంద్‌తో మొదలైన ప్రస్థానం

1988లో విశ్వనాథన్ ఆనంద్ భారత తొలి గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించారు. అప్పటి నుంచి దేశం 100వ గ్రాండ్‌మాస్టర్ మైలురాయిని చేరుకోవడానికి సుమారు 38 ఏళ్లు పట్టింది.

ముఖ్యంగా 2010 తర్వాత భారత్‌లో గ్రాండ్‌మాస్టర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో అనుజ్ శ్రీవత్రి 100వ ఆటగాడిగా నిలిచాడు.

ADVERTISEMENT

వివరాలు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి చెస్‌పై దృష్టి

మధ్యప్రదేశ్‌లోని కట్నీకి చెందిన అనుజ్ 2019 నుంచి ఇంటర్నేషనల్ మాస్టర్‌గా కొనసాగుతున్నాడు.

కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసిన అతడు.. చెస్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు.

తాజాగా గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించి తన లక్ష్యాన్ని చేరుకున్నాడు.

ఆనంద్ అభినందనలు.. 'క్రాకర్ లాంటి 100'

అనుజ్ శ్రీవత్రి చారిత్రక విజయంపై అఖిల భారత చెస్ సమాఖ్య అధ్యక్షుడు నితిన్ నారంగ్‌, భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అభినందనలు తెలిపారు.

దీపావళి పండుగ వేళ ఈ ఘనత సాధించడంపై ఆనంద్ ప్రత్యేకంగా స్పందించారు. 'ఇది క్రాకర్ లాంటి 100' అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ADVERTISEMENT