Mumbai Indians: ఐపీఎల్ 2027కు ముందు ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. బ్యాటింగ్ కోచ్‌గా ఊతప్ప!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఐదుసార్లు ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ తమ కోచింగ్ సిబ్బందిలో కీలక మార్పులు చేపట్టింది. భారత మాజీ స్టార్ క్రికెటర్ రాబిన్ ఊతప్పను జట్టు కొత్త బ్యాటింగ్ కోచ్‌గా నియమించినట్లు ప్రకటించింది. ఇప్పటివరకు బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన కీరన్ పొలార్డ్‌కు హెడ్ కోచ్‌గా ప్రమోషన్ లభించడంతో.. ఆ స్థానంలోకి ఊతప్పను తీసుకొచ్చింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన జట్టు కేవలం నాలుగు విజయాలే సాధించి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ వైఫల్యం నేపథ్యంలో జట్టు యాజమాన్యం కోచింగ్ విభాగంలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది.
వివరాలు
2008లో ముంబై తరుపున ఆడిన రాబిన్ ఉతప్ప
రాబోయే సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలనే లక్ష్యంతో కొత్త కోచింగ్ బృందాన్ని సిద్ధం చేస్తోంది.
కొన్ని రోజుల క్రితమే శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనే స్థానంలో కీరన్ పొలార్డ్‌ను హెడ్ కోచ్‌గా నియమించిన ముంబై ఇండియన్స్.. తాజాగా ఇతర కోచింగ్ స్థానాల్లోనూ మార్పులు ప్రకటించింది.
రాబిన్ ఊతప్ప నియామకాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సందర్భంగా.. "ఆటపై అద్భుతమైన అవగాహన, యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేసే స్పష్టత ఉన్న రాబిన్‌కు తిరిగి స్వాగతం అని పేర్కొంది.
కాగా ఊతప్ప 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడటం విశేషం.
వివరాలు
ముంబై కోచింగ్ బృందంలో కీలక మార్పులు
కొత్త కోచింగ్ బృందంలో భాగంగా న్యూజిలాండ్ మాజీ పేసర్ మిచెల్ మెక్‌క్లెనగన్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించింది.
ఫీల్డింగ్ కోచ్‌గా టి. దిలీప్‌కు బాధ్యతలు అప్పగించింది. డెవలప్‌మెంట్ బౌలింగ్ కోచ్‌గా ధవళ్ కులకర్ణిని ఎంపిక చేసింది.
ఈ నియామకాలతో హెడ్ కోచ్ కీరన్ పొలార్డ్ నేతృత్వంలో ముంబై ఇండియన్స్ కొత్త కోచింగ్ బృందం ఏర్పడింది.
ఇదిలా ఉంటే.. గురువారం బౌలింగ్ కోచ్‌లు లసిత్ మలింగ, పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ కార్ల్ హాప్‌కిన్సన్ జట్టును వీడుతున్నట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది.
వారి స్థానాల్లోనే తాజాగా కొత్త కోచ్‌లను నియమించింది.
వివరాలు
ఆటగాడిగా ఊతప్పకు గొప్ప అనుభవం
2007లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో రాబిన్ ఊతప్ప సభ్యుడిగా ఉన్నాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
2014 ఐపీఎల్ సీజన్‌లో 660 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ అనుభవం ఇప్పుడు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విభాగానికి ఉపయోగపడుతుందని జట్టు యాజమాన్యం భావిస్తోంది.
మరోవైపు కొత్త బౌలింగ్ కోచ్ మిచెల్ మెక్‌క్లెనగన్ కూడా ముంబై ఇండియన్స్‌తో గతంలో మంచి అనుబంధం కలిగి ఉన్నాడు.
2015 నుంచి 2020 మధ్య ముంబై తరఫున ఆడిన ఆయన.. జట్టు నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
వివరాలు
అనుభవజ్ఞులైన మాజీ ఆటగాళ్లకు కోచింగ్ బాధ్యతలు
ఫీల్డింగ్ కోచ్‌గా నియమితుడైన టి. దిలీప్ భారత జట్టుతో పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2024, 2026 టీ20 ప్రపంచకప్‌లు గెలిచిన భారత జట్టు కోచింగ్ బృందంలో ఆయన సభ్యుడిగా ఉన్నారు.
మొత్తంగా గత సీజన్ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్న ముంబై ఇండియన్స్.. అనుభవజ్ఞులైన మాజీ ఆటగాళ్లకు కోచింగ్ బాధ్యతలు అప్పగిస్తూ కొత్త ప్రణాళికలతో ముందుకెళ్తోంది.
కొత్త హెడ్ కోచ్ పొలార్డ్ నేతృత్వంలో ఈ బృందం ఐపీఎల్ 2027లో జట్టును తిరిగి విజయాల బాట పట్టిస్తుందో లేదో చూడాలి.