Loading...
CWG 2026: పంచ్‌పటాకా.. కామన్వెల్త్‌లో భారత బాక్సర్ల పతకాల పంట!
పంచ్‌పటాకా.. కామన్వెల్త్‌లో భారత బాక్సర్ల పతకాల పంట!

CWG 2026: పంచ్‌పటాకా.. కామన్వెల్త్‌లో భారత బాక్సర్ల పతకాల పంట!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 30, 2026
10:27 am

ఈ వార్తాకథనం ఏంటి

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో పతకాల వేట కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా బాక్సింగ్‌లో ఈసారి భారత్ చరిత్ర సృష్టించింది. మొత్తం 14 మంది భారత బాక్సర్లు బరిలోకి దిగగా, వారిలో 10 మంది ఇప్పటికే పతకాలను ఖాయం చేసుకున్నారు. కామన్వెల్త్‌ గేమ్స్‌ చరిత్రలో బాక్సింగ్‌లో భారత్ ఇన్ని పతకాలు ఖాయం చేసుకోవడం ఇదే తొలిసారి. మరోవైపు అథ్లెటిక్స్‌లో భారత లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నర్‌ గుల్వీర్‌ సింగ్ రజత పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. బుధవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ పోటీల్లో సాక్షి చౌదరి, అరుంధతి చౌదరి, జైస్మిన్‌ లాంబోరియా, సచిన్‌ సివాచ్‌, అంకుశ్‌ యాదవ్‌, నరేందర్‌ బెర్వాల్‌ సెమీఫైనల్‌కు చేరడంతో మరో ఆరు పతకాలు భారత్ ఖాతాలో ఖాయమయ్యాయి.

వివరాలు

సాక్షి, అరుంధతి, జైస్మిన్‌ జోరు

వీరిలో ఎంతమంది స్వర్ణ పతకాలను అందుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన కైట్లిన్‌ ఫ్రయర్స్‌ను 5-0తో చిత్తుగా ఓడించి సెమీస్‌కు చేరింది.

70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి న్యూజిలాండ్‌కు చెందిన మోర్గాన్‌ హెండర్‌సన్‌పై 3-1తో విజయం సాధించింది.

57 కేజీల విభాగంలో జైస్మిన్‌ లాంబోరియా ఇంగ్లాండ్‌కు చెందిన ఎలైస్‌ గ్లిన్‌ను 4-1తో ఓడించి పతకం ఖాయం చేసుకుంది.

వివరాలు

పురుషుల బాక్సింగ్‌లోనూ సత్తా

పురుషుల 60 కేజీల విభాగంలో మాజీ ప్రపంచ ఛాంపియన్‌ సచిన్‌ సివాచ్‌ బోట్స్‌వానాకు చెందిన ట్రెజర్‌ మోరెమిని 5-0తో చిత్తు చేశాడు.

80 కేజీల విభాగంలో అంకుశ్‌ యాదవ్‌ కూడా అదే 5-0 స్కోరుతో సేజెల్స్‌కు చెందిన జేడ్‌ మికాక్‌ను ఓడించాడు.

ఉత్కంఠభరితంగా సాగిన 90 కేజీల విభాగంలో నరేందర్‌ బెర్వాల్‌ 3-2తో సమోవాకు చెందిన మైకెల్‌ సెకోపై విజయం సాధించి సెమీస్‌కు చేరాడు.

ఈ ఆరు పతకాలతో కలిపి బాక్సింగ్‌లో భారత్‌కు మొత్తం 10 పతకాలు ఖాయం అయ్యాయి.

కామన్వెల్త్‌ గేమ్స్‌ చరిత్రలో ఇదే అత్యధికం. అంతకుముందు 2018లో భారత్ అత్యధికంగా 9 పతకాలు సాధించింది.

ADVERTISEMENT

వివరాలు

గుల్వీర్‌ సింగ్‌కు చారిత్రక రజతం

మంగళవారం మూడు పతకాలు ఖాయమవగా లవ్లీనా బొర్గొహెయిన్‌ ప్రత్యర్థి బై కారణంగా రింగ్‌లోకి దిగకుండానే సెమీఫైనల్‌కు చేరి పతకం ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే.

అథ్లెటిక్స్‌లో భారత స్టార్‌ గుల్వీర్‌ సింగ్ పురుషుల 10 వేల మీటర్ల పరుగులో అద్భుత ప్రదర్శనతో రజత పతకం సాధించాడు. అతడు 27 నిమిషాల 49.78 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రెండో స్థానంలో నిలిచాడు.

దీంతో కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఈ ఈవెంట్‌లో పతకం సాధించిన మొదటి భారతీయ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు.

భారీ వర్షంతో తడిసిన ట్రాక్‌పై అద్భుత నియంత్రణతో పరిగెత్తిన గుల్వీర్‌ అందరినీ ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన కై రాబిన్‌సన్‌ (27:48.93) స్వర్ణ పతకం గెలుచుకోగా, డేవిడ్‌ ముల్లార్‌కే (27:50.28) కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు.

ADVERTISEMENT

వివరాలు

షాట్‌పుట్‌లో తజిందర్‌, సమర్‌దీప్‌ ఫైనల్‌కు

పురుషుల షాట్‌పుట్‌లో తజిందర్‌పాల్‌ సింగ్‌ తూర్, సమర్‌దీప్‌ సింగ్‌ గిల్‌ ఫైనల్‌కు అర్హత సాధించారు.

తజిందర్‌ రెండో ప్రయత్నంలో 20.14 మీటర్లు విసిరి నేరుగా ఫైనల్‌లో చోటు దక్కించుకున్నాడు.

దీంతో మూడో ప్రయత్నం అవసరం లేకుండానే అర్హత సాధించాడు. తజిందర్‌కు ఇది మూడో కామన్వెల్త్‌ గేమ్స్‌.

2018లో ఎనిమిదో స్థానంలో నిలిచిన అతడు, 2022లో గజ్జల్లో గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు.

సమర్‌దీప్‌ సింగ్‌ గిల్‌ 19.95 మీటర్ల ప్రయత్నంతో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరాడు. ఈ విభాగంలో 20 మీటర్లు దాటిన వారు లేదా అత్యుత్తమ 12 స్థానాల్లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.

వివరాలు

అనిమేశ్‌కు సెమీస్‌ బెర్త్

పురుషుల 200 మీటర్ల పరుగులో భారత స్ప్రింటర్‌ అనిమేశ్‌ కుజుర్‌ సెమీఫైనల్‌కు చేరాడు. తొలి రౌండ్‌లో హీట్‌-4లో బరిలోకి దిగిన అతడు 20.46 సెకన్లలో రేసును పూర్తి చేసి ఏడో స్థానంలో నిలిచి ముందంజ వేశాడు.

వెయిట్‌లిఫ్టింగ్‌లో సంజనకు నిరాశ

మహిళల 77 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో 19 ఏళ్ల సంజన నిరాశపరిచింది. స్నాచ్‌లో 94 కేజీలు ఎత్తే మూడు ప్రయత్నాల్లోనూ విఫలమవడంతో, క్లీన్‌ అండ్‌ జెర్క్‌కు వెళ్లకుండానే పోటీల నుంచి నిష్క్రమించింది.

హైజంప్‌లో పూజ సింగ్‌కు నిరాశ

మహిళల హైజంప్‌లో ఆసియా ఛాంపియన్‌ పూజ సింగ్‌ 1.82 మీటర్ల ఎత్తు దాటడంలో విఫలమై ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది.

వివరాలు

స్విమ్మింగ్‌లో మిశ్రమ ఫలితాలు

పారా స్విమ్మింగ్‌ 50 మీటర్ల ఫ్రీస్టైల్‌లో చైతన్య విశ్వాస్‌ కులకర్ణి (32.77 సెకన్లు), సుయాశ్‌ నారాయణ్‌ జాదవ్‌ (35.35 సెకన్లు) ఫైనల్‌కు అర్హత సాధించారు.

అయితే పురుషుల 200 మీటర్ల ఫ్రీస్టైల్‌ స్విమ్మింగ్‌లో సాజన్‌ ప్రకాశ్‌ 1:51.99 నిమిషాల్లో రేసును పూర్తి చేసినప్పటికీ 20వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరలేకపోయాడు.

అనీశ్‌ గౌడ 1:51.64 నిమిషాలతో 18వ స్థానంలో నిలిచాడు.

ADVERTISEMENT