Loading...
South Africa vs Australia 2nd Test: 102 ఏళ్ల తర్వాత రిపీట్ అయిన రికార్డు.. దక్షిణాఫ్రికా జట్టులో అరుదైన ఘట్టం!
102 ఏళ్ల తర్వాత రిపీట్ అయిన రికార్డు.. దక్షిణాఫ్రికా జట్టులో అరుదైన ఘట్టం!

South Africa vs Australia 2nd Test: 102 ఏళ్ల తర్వాత రిపీట్ అయిన రికార్డు.. దక్షిణాఫ్రికా జట్టులో అరుదైన ఘట్టం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 19, 2026
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ఏకంగా 102 ఏళ్ల తర్వాత ఓ చారిత్రక రికార్డును పునరావృతం చేసింది. ఆస్ట్రేలియాతో గెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా తుది జట్టులో ఎనిమిది మంది ఆటగాళ్లు 30 ఏళ్లకు పైబడిన వారే ఉండటం విశేషం. గతంలో 1924లో ప్రొటీస్ జట్టులో ఇలాంటి కూర్పు కనిపించింది. శతాబ్ద కాలం తర్వాత మళ్లీ అదే తరహా జట్టు కూర్పు చోటుచేసుకోవడం క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆదివారం ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో తొలి రోజు కేవలం 12.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.

వివరాలు

24 పరుగుల తేడాతో ఓటమి

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

డర్బన్‌లో జరిగిన తొలి టెస్టులో 214 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన దక్షిణాఫ్రికా.. రెండో టెస్టులో పుంజుకోవాలనే లక్ష్యంతో తుది జట్టులో మూడు మార్పులు చేసింది.

ఈ క్రమంలో 30 ఏళ్ల మార్క్వెస్ అకర్‌మన్‌కు టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం కల్పించింది.

అలాగే కగిసో రబడ, మాథ్యూ బ్రీట్జ్కేలను తిరిగి జట్టులోకి తీసుకుంది. ఈ మూడు మార్పుల ఫలితంగా దక్షిణాఫ్రికా తుది జట్టులో 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్ల సంఖ్య ఎనిమిదికి చేరింది.

వివరాలు

సైమన్ హార్మర్ సీనియర్.. మార్కో జాన్సెన్ జూనియర్

దక్షిణాఫ్రికా జట్టులో స్పిన్నర్ సైమన్ హార్మర్ 37 ఏళ్ల వయసుతో అత్యంత పెద్ద వయస్కుడైన ఆటగాడిగా ఉన్నాడు.

మరోవైపు ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ 26 ఏళ్ల వయసుతో జట్టులో అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు.

ఇక ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టులోనూ అనుభవజ్ఞులదే పైచేయి కావడం మరో విశేషం. తుది జట్టులోని మొత్తం 11 మంది ఆటగాళ్లు 30 ఏళ్లు పైబడిన వారే.

అనుభవానికి ప్రాధాన్యం ఇస్తూ ఆసీస్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగింది. ఆ జట్టులో మాట్ రెన్‌షా 30 ఏళ్ల వయసుతో అత్యంత చిన్నవాడిగా ఉండగా.. స్టీవ్ స్మిత్, స్కాట్ బోలాండ్ 37 ఏళ్ల వయసుతో సీనియర్ ఆటగాళ్లుగా ఉన్నారు.

ADVERTISEMENT

వివరాలు

టెస్ట్ క్రికెట్‌లో రెండోసారి మాత్రమే!

ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల తరఫున కలిపి మొత్తం 19 మంది ఆటగాళ్లు 30 ఏళ్లకు పైబడిన వారే ఆడుతున్నారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ఇంతమంది సీనియర్ ఆటగాళ్లు బరిలోకి దిగడం ఇది రెండోసారి మాత్రమే కావడం విశేషం.

అంతకుముందు 1926లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఏకంగా 20 మంది 30 ఏళ్లకు పైబడిన ఆటగాళ్లు పాల్గొన్నారు.

ప్రస్తుతం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు కూడా ఈ అరుదైన గణాంకాల కారణంగా ప్రత్యేకతను సంతరించుకుంది.

ఒకవైపు అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో రెండు జట్లు బరిలోకి దిగగా.. మరోవైపు శతాబ్దం నాటి రికార్డులు మళ్లీ చర్చకు వచ్చాయి.

ADVERTISEMENT

వివరాలు

తొలి రోజు ఆటలో వర్షం అంతరాయం

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. వర్షం కారణంగా తొలి రోజు ఆటకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో కేవలం 12.2 ఓవర్ల ఆట మాత్రమే కొనసాగింది.

ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 20 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్ స్కాట్ బోలాండ్ రెండు వికెట్లూ పడగొట్టి ప్రొటీస్ జట్టును దెబ్బతీశాడు.

తొలి టెస్టులో భారీ ఓటమి ఎదుర్కొన్న దక్షిణాఫ్రికా.. రెండో టెస్టులో ఎలా పుంజుకుంటుందో చూడాలి.

అదే సమయంలో ఈ మ్యాచ్‌లో అనుభవజ్ఞులైన ఆటగాళ్ల ప్రదర్శనపై కూడా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT