LOADING...
Narendra Modi: 'జాతికి గర్వకారణం'- ప్రపంచకప్​ గెలిచిన భారత మహిళల జట్టుపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం 
'జాతికి గర్వకారణం'- ప్రపంచకప్​ గెలిచిన భారత మహిళల జట్టుపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం

Narendra Modi: 'జాతికి గర్వకారణం'- ప్రపంచకప్​ గెలిచిన భారత మహిళల జట్టుపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 03, 2025
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత మహిళల క్రికెట్ చరిత్రలో అపూర్వ ఘనత నమోదైంది. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 ఫైనల్లో టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలుపొందిన భారత మహిళల జట్టు, తొలిసారిగా ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు రాబట్టగా, లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా జట్టు 246 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ షఫాలీ వర్మ 78 బంతుల్లో 87 పరుగులతో దూకుడైన ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు బలమైన పునాది వేసింది. మిడిల్ ఆర్డర్ క్రీడాకారిణుల స్థిరమైన భాగస్వామ్యాలు స్కోరు బోర్డును ముందుకు నడిపించాయి.

Details

దేశవ్యాప్తంగా ఆనందోత్సాహ వాతావరణం

దక్షిణాఫ్రికా తరఫున కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ 101 పరుగులతో ఒంటరిగా పోరాడినా, ఆమె అవుటైన తర్వాత మ్యాచ్ భారత్ వైపు మళ్లిపోయింది. చివరగా దీప్తి శర్మ అద్భుత బౌలింగ్‌తో 39 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ విజయంతో భారత్ తన మూడో ఫైనల్ ప్రయత్నంలోనే (2005, 2017 తరువాత) చారిత్రక టైటిల్‌ను సొంతం చేసుకుంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించి, దేశవ్యాప్తంగా ఆనందోత్సాహ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జట్టుకు అభినందనలు తెలిపారు. "ఫైనల్‌లో భారత జట్టు ప్రదర్శన అద్భుతం. వారి నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల ప్రశంసనీయం. ఈ చారిత్రక విజయం దేశ యువతకు ప్రేరణగా నిలుస్తుంది," అని ఆయన ట్వీట్ చేశారు.

Details

మహిళా జట్టుకు హృదయపూర్వక శుభాకాంక్షలు

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా టీమ్ ఇండియాను ప్రశంసిస్తూ, "మీరు కేవలం ట్రోఫీనే గెలుచుకోలేదు, దేశ ప్రజల హృదయాలను కూడా గెలుచుకున్నారు. ఇది భారత క్రికెట్, మహిళా క్రీడాకారిణుల చరిత్రలో సువర్ణ ఘట్టమని పేర్కొన్నారు. అదేవిధంగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా భారత మహిళల జట్టును అభినందించారు. "చారిత్రక విజయం! ప్రపంచ ఛాంపియన్లైన భారత మహిళా జట్టుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు దేశానికి గర్వకారణం. భారత్ మాతా కీ జై!" అని ఆయన సోషల్ మీడియాలో హిందీలో పోస్ట్ చేశారు. మొత్తానికి, ఈ విజయం భారత మహిళా క్రికెట్ చరిత్రలో కొత్త యుగానికి నాంది పలికింది. ఇది కేవలం ఒక గెలుపు కాదు, దేశం మొత్తం గర్వపడే క్షణం.