Shehbaz Sharif: పాక్ విజయానికి వారం సెలవు ఇవ్వాల్సిందే.. ప్రధాని షరీఫ్‌పై ట్రోల్స్ వర్షం
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ (Pakistan PM Shehbaz Sharif) సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. భారత్‌పై తమ దేశ క్రికెట్ జట్టు సాధించిన ఓ చిన్న టోర్నమెంట్ విజయంపై ఆయన స్పందించిన తీరే ఇందుకు కారణమైంది. సాధారణ గ్రూప్ మ్యాచ్‌లో గెలిచినందుకు ప్రధాని స్థాయిలో ఇంతలా సంబరాలు చేసుకోవడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అత్యుత్సాహాన్ని లక్ష్యంగా చేసుకుని సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్ (Hong Kong Sixes)లో భాగంగా శుక్రవారం భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
వివరాలు
సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టు
అయితే, ఈ టోర్నీలోని గ్రూప్ దశ మ్యాచ్‌లో తమ జట్టు గెలవడంతో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎంతో ఉత్సాహంగా స్పందించారు.
ఆటగాళ్లను అభినందిస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టు పెట్టారు. 'భారత్‌పై అద్భుతమైన విజయం సాధించిన మన కుర్రాళ్లకు అభినందనలు.
అదొక మంచి మ్యాచ్. మన ఆటగాళ్లకు మద్దతు ఇవ్వడంలో అంకితభావంతో కృషి చేసిన పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ, ఆయన బృందానికి కూడా అభినందనలు'' అంటూ షహబాజ్ షరీఫ్ తన పోస్టులో పేర్కొన్నారు.
అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.
వివరాలు
విమర్శలు గుప్పిస్తున్న నెటిజన్లు
ఒక చిన్న టోర్నమెంట్‌లో సాధించిన విజయానికి ప్రధాని స్థాయిలో ఇంతటి ప్రాధాన్యత ఇవ్వడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
షహబాజ్ షరీఫ్ పోస్టుపై పలువురు నెటిజన్లు వ్యంగ్యంగా స్పందించారు. హాంకాంగ్ సిక్సెస్‌ను గల్లీ క్రికెట్‌తో పోలుస్తూ, ఇలాంటి టోర్నమెంట్‌లో గెలిచినందుకు ఇంత హడావుడి అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు.
మరికొందరు ఆసియా కప్, ప్రపంచకప్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ల కంటే గొప్ప విజయాన్ని సాధించినట్లు పాకిస్థాన్ సంబరాలు చేసుకుంటోందని ఎద్దేవా చేస్తున్నారు.
వివరాలు
నెట్టింట్లో వైరల్ అవుతున్న కొన్ని ట్రోల్స్ ఇవే..
''అదొక గల్లీ క్రికెట్ లాంటి టోర్నమెంట్. దానికి అంత బిల్డప్ అవసరమా?
''హాంకాంగ్ సిక్సెస్ విజయంపై ప్రధాని పోస్టు పెట్టడం హాస్యాస్పదంగా ఉంది.''
''ఆసియా కప్, ప్రపంచకప్ కంటే గొప్ప టోర్నీలో భారత్‌పై పాక్ గెలిచినందుకు అభినందనలు.''
''ఈ ఘన విజయానికి కచ్చితంగా వారం రోజుల సెలవు ప్రకటించాల్సిందే.''
ఇలా భారత్‌పై హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో సాధించిన విజయంపై పాక్ ప్రధాని చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన అత్యుత్సాహంపై నెటిజన్లు సెటైర్లు వేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.