Abhishek Sharma: అంచనాలతో షేక్ అయ్యిన అభిషేక్… అసలు ఆట ఎప్పుడు?
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ప్రపంచకప్‌కు ముందు భారత జట్టులో నుంచి ప్రత్యర్థి జట్లకు అతిపెద్ద సవాలుగా నిలిచే ఆటగాడిగా అభిషేక్ శర్మపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విరాట్ కోహ్లీ లేకపోవడంతో ఏర్పడిన ఖాళీని అతనే భర్తీ చేస్తాడని విశ్లేషకులు భావించారు. కానీ గ్రూప్ దశలో కనీసం ఖాతా కూడా తెరవలేడని ఎవ్వరూ ఊహించి ఉండరు. అనారోగ్యం కారణంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో అతను బరిలోకి దిగలేకపోయాడు. మిగతా మూడు మ్యాచ్‌ల్లోనూ అవసరం లేని దూకుడుతో వికెట్లు సమర్పించుకున్నాడు. తన సహజ దూకుడు శైలిని పూర్తిగా మార్చాల్సిన అవసరం లేకపోయినా, కనీసం క్రీజులో స్థిరపడేంతవరకు ఆచితూచి ఆడాలని, బంతి స్వభావాన్ని గమనించి షాట్లు ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచించారు. అయినప్పటికీ ఆ సూచనలను అతను పట్టించుకోలేదు.
వివరాలు
మానసిక ఒత్తిడిని అధిగమించడం అతనికి పెద్ద సవాలే
వరుసగా రెండు సార్లు డకౌట్ అయిన తర్వాత కూడా జాగ్రత్తగా ఆడే ప్రయత్నం కనిపించలేదు. ముందుగా సింగిల్స్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాలన్న సునీల్ గవాస్కర్ సూచనను పాటించి ఉండాల్సింది. బౌలర్లను తక్కువ అంచనా వేసి, అడ్డదిడ్డంగా షాట్లు ప్రయత్నించడం వల్లనే అతను ఔటవుతున్నాడు. ఒకటి రెండు డాట్‌బాల్స్ పడగానే తనలోని విధ్వంసక బ్యాటర్ ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నట్లుగా బంతిని పూర్తిగా అంచనా వేయకుండా బ్యాట్ ఊపేయడం కారణంగా పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై వికెట్లు కోల్పోయాడు. టోర్నీ ఆరంభానికి ముందు అభిషేక్‌పై ఉన్న అంచనాలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. ప్రత్యర్థి జట్లను కుదిపేస్తాడని భావించిన ఈ ఓపెనర్, ప్రస్తుతం తానే ఒత్తిడిలోకి వెళ్లినట్లు కనిపిస్తున్నాడు. ఈ పరిస్థితిలో మానసిక ఒత్తిడిని అధిగమించడం అతనికి పెద్ద సవాలే.
వివరాలు
గ్రూప్ వైఫల్యం తర్వాత అసలైన పరీక్ష
అయితే గ్రూప్ దశలో వచ్చిన వైఫల్యాల ఆధారంగా అతని సామర్థ్యాన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. ఇప్పటికీ అతను జట్టుకు విలువైన బ్యాటరే. లీగ్ దశలో అతని ఫామ్ లేకపోవడం జట్టుపై పెద్దగా ప్రభావం చూపలేదు. భారత్ సులభంగా సూపర్-8 దశకు అర్హత సాధించింది. కానీ తదుపరి దశలో ప్రతి మ్యాచ్ అత్యంత కీలకమైనదే కాబట్టి అతను మరింత అప్రమత్తంగా ఉండాలి. సఫారీ జట్టుతో జరిగే మ్యాచ్‌లో కొంత సమయం తీసుకుని క్రీజులో స్థిరపడితే, తర్వాత అతని అసలు రూపాన్ని మళ్లీ చూడవచ్చు. కీలకమైన సూపర్-8 దశ నుంచే అభిషేక్ తన అసలు ఆటను ప్రదర్శిస్తాడేమో చూడాలి. వేచి చూద్దాం!