Bangladesh Cricket Team: బంగ్లాదేశ్‌కు షాక్.. అఫ్గాన్‌తో భారత్ టీ20 సిరీస్ ఖరారు
ఈ వార్తాకథనం ఏంటి
వచ్చే నెలలో తమతో సిరీస్ ఆడేందుకు టీమిండియా వస్తుందని ఆశలు పెట్టుకున్న బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ పర్యటనకు భారత్ వెళ్లడం లేదన్న విషయం తాజాగా స్పష్టమైంది. సెప్టెంబర్‌లో అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్ ఆడనున్నట్లు బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అఫ్గాన్ క్రికెట్ బోర్డు సీఈవో నసీబ్ ఖాన్ నిన్న వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు దిల్లీ వేదికగా జరగనున్నాయి. ఈ సిరీస్‌కు అఫ్గానిస్థాన్ జట్టుకు దిల్లీ హోం గ్రౌండ్‌గా వ్యవహరించనుంది. గత జూన్‌లో భారత్, అఫ్గానిస్థాన్ మధ్య ఒక టెస్టు, మూడు వన్డేల సిరీస్ జరిగిన విషయం తెలిసిందే.
వివరాలు
అఫ్గాన్ క్రికెట్‌కు అండగా ఉంటాం: మన్హాస్
తొలి టీ20 సెప్టెంబర్ 13న జరగనుంది. రెండో టీ20 సెప్టెంబర్ 15న, మూడో టీ20 సెప్టెంబర్ 19న నిర్వహించనున్నారు.
అఫ్గానిస్థాన్ క్రికెట్‌కు భారత క్రికెట్ బోర్డు ఎప్పటికీ అండగా ఉంటుందని బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ తెలిపారు.
అఫ్గాన్ క్రికెట్ అభివృద్ధికి అవసరమైన మద్దతు అందిస్తామని చెప్పారు.
అత్యున్నత స్థాయిలో పోటీపడేలా ఆ జట్టుకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు సహకరిస్తామని పేర్కొన్నారు.
ఇందులో ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా కీలక భాగమని తెలిపారు.
నాణ్యమైన జట్లతో ఆడటం ద్వారా అఫ్గాన్ ఆటగాళ్లకు విలువైన అనుభవం లభిస్తుందని చెప్పారు.
భారత్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు అఫ్గానిస్థాన్‌ను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.
వివరాలు
ఇరు జట్ల పోరు ఆసక్తికరం: దేవజిత్ సైకియా
భారత్ వేదికగా అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న ఈ సిరీస్‌కు బీసీసీఐ మద్దతు ఇస్తోందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.
మైదానంలో భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జరిగే పోరు ఆసక్తికరంగా ఉంటుందని చెప్పారు.
ఇరు జట్లలోనూ నాణ్యమైన క్రికెటర్లు ఉన్నారని పేర్కొన్నారు. భారత్‌లో కూడా అఫ్గాన్ ఆటగాళ్లకు అభిమానులు ఉన్నారంటే.. వారి ఆటతీరే అందుకు కారణమని అన్నారు.
ఇటీవల ఇరు జట్ల మధ్య ఒక టెస్టు, వన్డే సిరీస్ జరిగిన విషయాన్ని గుర్తుచేశారు.
మూడు ఫార్మాట్లలోనూ భారత్, అఫ్గానిస్థాన్ తలపడే అవకాశాలను ఏమాత్రం వదులుకోబోమని దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.