LOADING...
Asia Cup: అఫ్గాన్‌ పోరాడినా.. బంగ్లాదేశ్‌ గెలుపుతో సూపర్‌-4లో ఉత్కంఠ

Asia Cup: అఫ్గాన్‌ పోరాడినా.. బంగ్లాదేశ్‌ గెలుపుతో సూపర్‌-4లో ఉత్కంఠ

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 17, 2025
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్‌ టీ20 టోర్నీలో గ్రూప్‌-ఎలో ఇప్పటికే భారత్‌ సూపర్‌-4కు చేరింది. ఇక మిగిలిన బెర్త్‌ బుధవారం జరగబోయే పాకిస్థాన్-యూఏఈ మ్యాచ్‌తో ఖరారవుతుంది. కానీ గ్రూప్‌-బిలో మాత్రం చివరి వరకు ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైన హాంకాంగ్‌ పోటీ నుంచి నిష్క్రమించింది. అయితే శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ జట్లలో ఎవరి సూపర్‌-4 స్థానం ఖరారవ్వలేదు. మంగళవారం జరిగిన థ్రిల్లర్‌లో బంగ్లాదేశ్‌ 8 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్‌ గెలిచుంటే, ఆ జట్టుతో పాటు శ్రీలంక రెండేసి విజయాలతో ముందే సూపర్‌-4లోకి వెళ్లేవి. అలాంటప్పుడు బంగ్లాదేశ్‌ రెండు ఓటములతో టోర్నీ నుంచి బయటకెళ్లేది. కానీ బంగ్లా గెలుపుతో పరిస్థితి మరింత క్లిష్టమైంది.

Details

ఎవరి రన్‌రేట్‌ మెరుగ్గా ఉంటే వారికే సూపర్ 4లోకి అర్హత

దీంతో ఎవరికీ బెర్త్ ఖాయం కాలేదు. గురువారం జరగబోయే చివరి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంక-అఫ్గాన్‌ తలపడతాయి. లంక గెలిస్తే, ఆ జట్టుతో పాటు బంగ్లాదేశ్‌ ముందడుగు వేస్తాయి. అఫ్గాన్‌ గెలిస్తే మాత్రం లంక, బంగ్లాలో ఎవరి రన్‌రేట్‌ మెరుగ్గా ఉంటే వారే సూపర్‌-4లోకి అర్హత సాధిస్తారు. బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు తంజిద్‌ హసన్‌ (52; 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సైఫ్‌ హసన్‌ (30; 28 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక పాత్ర పోషించారు. మిడిల్‌ఆర్డర్‌లో తౌహిద్‌ హృదోయ్‌ (26; 20 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) కూడా సహకరించడంతో బంగ్లా 20 ఓవర్లలో 5 వికెట్లకు 154 పరుగులు చేసింది.

Details

8 పరుగుల తేడాతో ఓటమి

154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్‌ 20 ఓవర్లు పూర్తి చేసేసరికి 146 పరుగులకే ఆలౌటైంది. ఆరంభంలో నసుమ్‌ అహ్మద్‌ (2/11) దెబ్బకు అటల్‌ (0), ఇబ్రహీం జద్రాన్‌ (5) త్వరగా వెనుదిరగడంతో స్కోరు 18/2గా నిలిచింది. ఈ దశలో రహ్మనుల్లా గుర్బాజ్‌ (35; 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అఫ్గాన్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. 77/5 వద్ద నిలిచిన అఫ్గాన్‌ జట్టుకు అజ్మతుల్లా (30; 16 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లు) మళ్లీ ఆశలు రేపాడు. కానీ చివర్లో ముస్తాఫిజుర్‌ (3/28), తస్కిన్‌ (2/34) చెలరేగడంతో అఫ్గాన్‌ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో పరాజయం పాలైంది.