Abhishek Sharma: దూకుడుకి పరిమితి అవసరం.. అభిషేక్ శర్మను హెచ్చరించిన ఇర్ఫాన్ పఠాన్
ఈ వార్తాకథనం ఏంటి
భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ప్రస్తుతం టీ20 సిరీస్‌లలో దూకుడు చూపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. బౌలర్లపై ఏ మాత్రం భయపడకుండా తనదైన శైలిలో బాదుతూ బ్యాటింగ్ చేస్తున్న ఈ యంగ్ స్టార్‌పై మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) ముఖ్యమైన సలహా ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో అభిషేక్ 176.34 స్ట్రైక్‌రేట్‌తో 163 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు. అయితే అతడి అగ్రెసివ్ బ్యాటింగ్ శైలికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పఠాన్ సూచించాడు. 'అభిషేక్ ప్రస్తుతం నిర్భయంగా ఆడుతున్నాడు. కానీ ఇది ద్వైపాక్షిక సిరీస్.
Details
మొదటి బంతికే షాట్ ఆడడం పద్ధతి కాదు
వరల్డ్‌కప్ వంటి పెద్ద టోర్నీల్లో జట్లు పూర్తిగా సన్నద్ధమవుతాయి. ప్రతి బంతిని ముందుకు వచ్చి బాదాలని చూస్తే, ప్రత్యర్థి బౌలర్లు ఆ పద్ధతిని టార్గెట్ చేసి అతడిని ఔట్ చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి షాట్ల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని ఇర్ఫాన్ సూచించాడు. అతని దూకుడుపై నియంత్రణ అవసరమని పేర్కొన్న పఠాన్, టీమ్ మేనేజ్‌మెంట్ ఈ అంశంపై దృష్టి పెడుతుందనే నమ్మకం ఉంది. యువరాజ్ సింగ్ అతడి వ్యక్తిగత కోచ్‌గానూ ఉన్నారు కాబట్టి ఆయనే ఈ విషయాన్ని అభిషేక్‌కి చెబుతారని భావిస్తున్నా. నేను కూడా యూవీతో మాట్లాడతా. ప్రతి బౌలర్‌పై మొదటి బంతికే భారీ షాట్ ఆడటం సరికాదని పేర్కొన్నాడు.
Details
హైరిస్క్ షాట్లు ఆడటంలో జాగ్రత్త అవసరం
ఇక ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. 4.5 ఓవర్ల ఆటలో అభిషేక్ 13 బంతుల్లో 23 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఫీల్డర్లు రెండు సులభ క్యాచ్‌లు వదిలేయడంతో అతడు ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ పఠాన్, 'ఐదో టీ20లో అతడికి రెండుసార్లు అదృష్టం కలిసొచ్చింది. అందులో ఒక క్యాచ్ పట్టినా అతడి ఇన్నింగ్స్ ముగిసేది. హై రిస్క్ షాట్లు ఆడడంలో కొంత జాగ్రత్త అవసరం. నాథన్ ఎల్లిస్ తన బౌలింగ్‌లో వ్యూహాత్మక మార్పులతో అభిషేక్‌ను ఇబ్బందిపెట్టాడు. ఇదే పద్ధతిని ఇతర జట్లు కూడా అనుసరించే అవకాశముందని వ్యాఖ్యానించాడు.