LOADING...
Commonwealth Games: 2030 కామన్వెల్త్‌ గేమ్స్‌ వేదికగా అహ్మదాబాద్‌.. ధృవీకరించిన కామన్వెల్త్‌ స్పోర్ట్‌ 
ధృవీకరించిన కామన్వెల్త్‌ స్పోర్ట్

Commonwealth Games: 2030 కామన్వెల్త్‌ గేమ్స్‌ వేదికగా అహ్మదాబాద్‌.. ధృవీకరించిన కామన్వెల్త్‌ స్పోర్ట్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 27, 2025
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్‌ నగరం 2030కామన్వెల్త్‌ క్రీడల ఆతిథ్య హక్కులను అధికారికంగా దక్కించుకుంది. బుధవారం జరిగిన కామన్వెల్త్‌ స్పోర్ట్‌ సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించింది. ఇప్పటికే ఎగ్జిక్యూటివ్‌ బోర్డు గత నెలలో అహ్మదాబాద్‌ను ఆతిథ్యానికి తగిన నగరంగా సిఫారసు చేసిన నేపథ్యంలో,ఈ తాజా నిర్ణయం ఆ ప్రక్రియను పూర్తిచేసింది. ఈ హక్కులు భారత్‌కు రావడం ద్వారా,దేశం 2036 ఒలింపిక్స్‌ను నిర్వహించే లక్ష్యానికి మరింత బలం చేకూరినట్లైంది. 2030 కామన్వెల్త్‌ గేమ్స్‌ రేసులో నైజీరియాలోని అబుజా కూడా పోటీ పడింది.అయితే ఆ నగరాన్ని 2034 గేమ్స్‌ నిర్వహణకు పరిశీలించనుందని కామన్వెల్త్‌ స్పోర్ట్‌ సంస్థ ప్రకటించింది. ఇదివరకు భారత్‌ 2010లో ఢిల్లీలో కామన్వెల్త్‌ క్రీడలను నిర్వహించిన సంగతి తెలిసిందే. అప్పుడు దాదాపు రూ.70వేల కోట్లు వ్యయమయ్యాయి.

వివరాలు 

క్రీడల ప్రధాన వేదికగా సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ స్పోర్ట్స్‌ ఎన్‌క్లేవ్

2030 గేమ్స్‌లో 15 నుంచి 17 క్రీడా విభాగాల్లో పోటీలను నిర్వహించే యోచనలో భారత్‌ ఉంది. ఈ క్రీడల ప్రధాన వేదికగా సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ స్పోర్ట్స్‌ ఎన్‌క్లేవ్‌ను నిర్ణయించారు. అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ నిర్ణీత గడువుకల్లా పూర్తి చేస్తామని భారత అధికారులు అన్నారు. 2030 అక్టోబర్‌లో ఈ క్రీడలను నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా, కామన్వెల్త్‌ క్రీడలకు ముందు 2028లో ప్రపంచ అండర్‌-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ను కూడా అహ్మదాబాద్‌లో నిర్వహించాలనే ప్రతిపాదనను భారత ఒలింపిక్‌ సంఘం పరిశీలిస్తోంది. భారత్‌ ఈసారి సీడబ్ల్యూజీ ఆతిథ్య హక్కులు పొందిన విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు.