Virat Kohli: 'నా అవార్డులన్నీ అమ్మకే'.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీలపై విరాట్ భావోద్వేగ వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
వడోదర వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన భారత్, మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచిన వ్యక్తి స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ. మరోసారి తన క్లాస్‌ను చాటుతూ జట్టును విజయపథంలో నడిపించాడు. 301 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన భారత్‌కు విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 91 బంతుల్లో 93 పరుగులు చేసి మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపుకు తిప్పాడు.
Details
45వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు
ఒత్తిడిలోనూ బాధ్యతాయుతమైన ఆటతో జట్టును గెలుపు దిశగా నడిపించిన కోహ్లీ, ఈ అద్భుత ప్రదర్శనకు గాను 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇది విరాట్ వన్డే కెరీర్‌లో 45వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కాగా,అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 71వ అవార్డు కావడం విశేషం. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ ఓఆసక్తికర ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ప్రెజెంటర్ హర్ష భోగ్లే మాట్లాడుతూ.. "45 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అంటే చాలా పెద్ద సంఖ్య. వాటిని ఉంచుకోవడానికి ప్రత్యేక గది అవసరం అవుతుందేమోనని ప్రశ్నించారు. దీనికి విరాట్ ఎంతో భావోద్వేగంగా స్పందించాడు. తాను గెలిచిన అవార్డులన్నింటినీ తన తల్లికి పంపిస్తానని చెప్పాడు.
Details
రెండో స్థానంలో విరాట్ కోహ్లీ
గురుగ్రామ్‌లో నివసించే ఆమె వాటిని ఎంతో ఇష్టంగా దగ్గర పెట్టుకుంటారని, తన విజయాలు ఆమెకు గర్వకారణంగా అనిపిస్తాయని పేర్కొన్నాడు. అందుకే అవన్నీ అమ్మకే ఇస్తానని చెప్పడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల విషయానికి వస్తే విరాట్ కోహ్లీ ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ ఇప్పటివరకు 76 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకోగా, విరాట్ 71 అవార్డులతో అతని వెనుకనే ఉన్నాడు. వీరిద్దరి మధ్య కేవలం 5 అవార్డుల తేడా మాత్రమే ఉండటంతో, రాబోయే రోజుల్లో ఈ రికార్డును విరాట్ కోహ్లీ అధిగమించే అవకాశాలు ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.