Surrey groundsman: గంభీర్‌తో వాగ్వాదం.. ఇప్పుడు ECB ఉద్యోగితోనూ గొడవ.. సర్రే గ్రౌండ్స్‌మన్‌పై వేటు!
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్‌లోని సర్రే జట్టు హెడ్ గ్రౌండ్స్‌మన్ లీ ఫోర్టిస్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. గతంలో భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో వాగ్వాదంతో వార్తల్లో నిలిచిన ఫోర్టిస్.. తాజాగా ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ఉద్యోగితో తీవ్ర వాగ్వాదానికి దిగినట్లు 'ది టెలిగ్రాఫ్' వెల్లడించింది. జూలై 28న 'ది హండ్రెడ్' సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపింది. ఈ వివాదం అనంతరం సదరు ECB ఉద్యోగి కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. దీంతో ది ఓవల్ క్రికెట్ గ్రౌండ్‌లో తన విధుల నుంచి ఫోర్టిస్‌ను సెలవుపై పంపించారు.
వివరాలు
అసలేం జరిగింది?
జూలై 28న ది ఓవల్‌లో లీ ఫోర్టిస్‌కు, ECB ఉద్యోగికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మరుసటి రోజు ది ఓవల్ వేదికగా MI లండన్, లండన్ స్పిరిట్ జట్లు తలపడాల్సి ఉంది.
ఈ మ్యాచ్ కోసం పిచ్‌ను సిద్ధం చేసే పనుల్లో సదరు ECB ఉద్యోగి కూడా పాల్గొంటున్న సమయంలోనే ఫోర్టిస్‌తో వివాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన అనంతరం సర్రే చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టీవ్ ఎల్వర్తీ.. లీ ఫోర్టిస్‌తో మాట్లాడారు. ఆ తర్వాత ఫోర్టిస్ మైదానం నుంచి వెళ్లిపోయాడు.
అప్పటి నుంచి అతడు ది ఓవల్‌లో కనిపించలేదని సమాచారం.
వివరాలు
ఇక ఫోర్టిస్ తిరిగి వస్తాడా?
లీ ఫోర్టిస్ 2012 నుంచి ది ఓవల్‌కు హెడ్ గ్రౌండ్స్‌మన్‌గా వ్యవహరిస్తున్నాడు. అంతేకాకుండా 2022 నుంచి 2024 వరకు వరుసగా మూడు సార్లు ECB 'గ్రౌండ్స్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును గెలుచుకున్నాడు.
అయితే తాజా ఘటన తర్వాత అతడు తిరిగి తన బాధ్యతల్లోకి వస్తాడా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ఫోర్టిస్ తన పదవికి తిరిగి రాకపోతే.. వచ్చే ఏడాది జరగనున్న కీలక మ్యాచ్‌లకు ముందు సర్రే కొత్త గ్రౌండ్స్‌మన్‌ను నియమించుకోవాల్సి ఉంటుంది.
వచ్చే ఏడాది ది ఓవల్‌లో యాషెస్ టెస్టుతో పాటు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కూడా జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
వివరాలు
గతంలో గంభీర్‌తోనూ వాగ్వాదం
లీ ఫోర్టిస్ గతేడాది జూలై చివర్లో భారత క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. అప్పట్లో భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో అతడు తీవ్ర వాగ్వాదానికి దిగాడు.
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఐదో, చివరి టెస్టుకు రెండు రోజుల ముందు ఈ ఘటన చోటుచేసుకుంది.
పిచ్ స్క్వేర్ ప్రాంతంలో భారత ఆటగాళ్లు త్రో డౌన్స్ నిర్వహించడంపై క్యూరేటర్ ఫోర్టిస్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ విషయంపై గంభీర్, ఫోర్టిస్ మధ్య వాగ్వాదం జరిగింది.
ఆ సమయంలో తీవ్ర ఆగ్రహానికి గురైన గంభీర్.. ఫోర్టిస్ వైపు వేలు చూపిస్తూ, 'నువ్వు కేవలం గ్రౌండ్స్‌మన్‌వి' అంటూ వ్యాఖ్యానించినట్లు సమాచారం.