LOADING...
Amarnath: హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అమర్‌నాథ్‌ నియామకం
హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అమర్‌నాథ్‌ నియామకం

Amarnath: హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అమర్‌నాథ్‌ నియామకం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 03, 2026
09:32 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ)లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఫోర్జరీ పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేయడం, నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టున్న ఆరోపణల నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావును అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ సురేశ్‌కుమార్‌ కైత్‌ పదవి నుంచి తొలగించారు. ఆయనను తక్షణమే అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన అమర్‌నాథ్‌ను నూతన అధ్యక్షుడిగా ప్రకటించారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను బ్లాక్‌మెయిల్‌ చేశాడన్న ఆరోపణలు, సీఐడీ అరెస్టు నేపథ్యంలో జగన్మోహన్‌రావును ఇప్పటికే హెచ్‌సీఏ సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఉపాధ్యక్షుడు దల్జీత్‌ సింగ్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజా అంబుడ్స్‌మన్‌ తీర్పుతో అమర్‌నాథ్‌ పూర్తిస్థాయి అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు.

Details

63 ఓట్లు సాధించి అధ్యక్షుడిగా ఎంపిక

సోమవారం ఉప్పల్‌ స్టేడియంలో ఆయన నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2023 అక్టోబరు 20న జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో జగన్మోహన్‌రావు 63 ఓట్లు సాధించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అదే సమయంలో అమర్‌నాథ్‌ 62 ఓట్లు మాత్రమే పొందడంతో త్రుటిలో అధ్యక్ష పదవి చేజారింది. అయితే జగన్మోహన్‌రావు 'శ్రీచక్ర క్రికెట్‌ క్లబ్‌' ప్రతినిధిగా తప్పుడు పత్రాలు సమర్పించి అక్రమంగా ఎన్నికల్లో పోటీ చేశారని ఆరోపిస్తూ అమర్‌నాథ్‌ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించారు. గౌలిపుర క్రికెట్‌ క్లబ్‌ను శ్రీచక్ర క్రికెట్‌ క్లబ్‌గా మార్చడం చెల్లదని అప్పటి అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి ఇచ్చిన తీర్పును అమర్‌నాథ్‌ తన పిటిషన్‌లో ప్రధానంగా ప్రస్తావించారు.

Details

నకిలీ పత్రాలు సృష్టించి ఎన్నికల్లో పోటీ చేసినట్టు నిర్ధారణ

ఇదే సమయంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వ్యవహారంపై విచారణ చేపట్టిన సీఐడీ, జగన్మోహన్‌రావు శ్రీచక్ర క్లబ్‌ కోశాధికారిగా నకిలీ పత్రాలు సృష్టించి ఎన్నికల్లో పోటీ చేసినట్టు నిర్ధారించింది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టెండర్లు లేకుండానే క్యాటరింగ్‌ కాంట్రాక్టులు కట్టబెట్టడం, ప్లంబింగ్‌, ఏసీలు, దుస్తుల కొనుగోళ్లలో కోట్లాది రూపాయల నిధులను పక్కదారి పట్టించినట్టు ఆయనపై ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే 2025 జులై 9న సీఐడీ అధికారులు జగన్మోహన్‌రావును అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అమర్‌నాథ్‌ పిటిషన్‌ను విచారించిన అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ సురేశ్‌కుమార్‌ కైత్‌.. జగన్మోహన్‌రావు ప్రవర్తన హెచ్‌సీఏ ప్రతిష్ఠకు తీవ్ర భంగం కలిగించేలా ఉందని అభిప్రాయపడ్డారు.

Advertisement

Details

స్టేడియంలోకి ప్రవేశించకుండా ఆంక్షలు

హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసినప్పటికీ, జగన్మోహన్‌రావును హెచ్‌సీఏ కార్యాలయం, స్టేడియాల్లోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తప్పుడు పత్రాల ద్వారా పదవిని పొందడం వంటి తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అధ్యక్షుడిగా కొనసాగేందుకు అర్హుడు కాదని స్పష్టం చేశారు. హెచ్‌సీఏ ప్రయోజనాల దృష్ట్యా అధ్యక్ష పదవిని ఎక్కువకాలం ఖాళీగా ఉంచలేమని పేర్కొన్న అంబుడ్స్‌మన్‌, ఎన్నికల్లో కేవలం ఒక్క ఓటు తేడాతో రెండో స్థానంలో నిలిచిన అమర్‌నాథ్‌ను అధ్యక్షుడిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించారు. మిగిలిన పదవీకాలానికి అమర్‌నాథ్‌ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా కొనసాగుతారని స్పష్టంచేశారు.

Advertisement