Loading...
Ananya bangar: ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడేందుకు అనన్య బంగర్‌కు క్లియరెన్స్.. తీవ్రంగా వ్యతిరేకించిన సఫారీ స్టార్
ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడేందుకు అనన్య బంగర్‌కు క్లియరెన్స్.. తీవ్రంగా వ్యతిరేకించిన సఫారీ స్టార్

Ananya bangar: ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడేందుకు అనన్య బంగర్‌కు క్లియరెన్స్.. తీవ్రంగా వ్యతిరేకించిన సఫారీ స్టార్

వ్రాసిన వారు Moogati Shabari
Aug 28, 2026
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళా క్రికెట్‌లో మరో వివాదం తెరపైకి వచ్చింది. భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె, ట్రాన్స్‌జెండర్ క్రికెటర్ అనన్య బంగర్‌కు ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) అనుమతి ఇవ్వడంపై దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ మారిజాన్ కాప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి నిర్ణయాలను అనుమతించకూడదంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించింది.

వివరాలు

బీసీసీఐ నుంచి స్పందన లేకపోవడంతో..

సంజయ్ బంగర్ కుమార్తె అనన్య ఈ ఏడాది థాయ్‌లాండ్‌లో లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంది.

అనంతరం క్రికెట్‌లోకి తిరిగి రావాలని భావించిన ఆమె తొలుత భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)ని సంప్రదించినట్లు తెలుస్తోంది.

అయితే అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియాను ఆశ్రయించింది.

అనన్య అభ్యర్థనను పరిశీలించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ఆ దేశంలోని కమ్యూనిటీ క్రికెట్ సర్క్యూట్‌లో ఆడేందుకు ఆమెకు అనుమతి మంజూరు చేసింది.

దీంతో ఆస్ట్రేలియాలో ప్రీమియర్ క్రికెట్ పోటీల్లో పాల్గొనే అవకాశం ఆమెకు లభించింది.

భవిష్యత్తులో మహిళల బిగ్ బాష్ లీగ్ (WBBL) వంటి ఎలైట్ స్థాయి టోర్నీల్లో ఆడేందుకు కూడా ఈ నిర్ణయం మార్గం సుగమం చేసే అవకాశం ఉంది.

వివరాలు

'ఇది పూర్తిగా అసంబద్ధం'

అనన్యకు క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి ఇచ్చిన విషయానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను మారిజాన్ కాప్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

ఈ నిర్ణయాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించింది. "ఇది పూర్తిగా అసంబద్ధం. ఇలాంటి వాటిని అస్సలు అనుమతించకూడదు" అంటూ ఆమె వ్యాఖ్యానించింది.

ఈ సందర్భంగా డబ్ల్యూబీబీఎల్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా ట్యాగ్ చేసింది.

కాప్ చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

ADVERTISEMENT

వివరాలు

2027 వరకు కమ్యూనిటీ క్రికెట్‌లో అవకాశం

క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం అనన్య మార్చి 2027 వరకు ఆస్ట్రేలియాలోని ఏ రాష్ట్రంలోనైనా ప్రీమియర్ క్రికెట్ లేదా కమ్యూనిటీ క్రికెట్ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంది.

అయితే ఆ తర్వాత ఎలైట్ స్థాయి క్రికెట్‌లో ఆడాలంటే కొన్ని నిబంధనలను ఆమె పాటించాల్సి ఉంటుంది.

ముఖ్యంగా ఆమె రక్తంలో టెస్టోస్టెరాన్ స్థాయి 10 nmol/L కంటే తక్కువగా ఉందని నిర్ధారించే పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు

సర్ఫరాజ్, ముషీర్‌తో కలిసి ఆడిన అనన్య..

అనన్య బంగర్ గతంలో పురుషుడిగా ఉన్న సమయంలో ముంబై ఏజ్-గ్రూప్ క్రికెట్‌లో ఆడింది.

ఆ సమయంలో భారత క్రికెట్‌లో గుర్తింపు పొందిన సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్ వంటి ఆటగాళ్లతో కలిసి ఆమె క్రికెట్ ఆడిన విషయం తెలిసిందే.

క్రికెట్ ఆస్ట్రేలియా తాజా నిర్ణయంతో అనన్యకు మరోసారి క్రికెట్‌లో తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభించింది.

అయితే ట్రాన్స్‌జెండర్ క్రికెటర్లకు మహిళల క్రికెట్‌లో అవకాశాల అంశంపై ఇప్పటికే ఉన్న భిన్నాభిప్రాయాలు.. తాజా పరిణామంతో మరోసారి తెరపైకి వచ్చాయి.

ADVERTISEMENT