Angelo Mathews: బంగ్లాదేశ్ జట్టు దిగజారిపోయింది.. నా 'టైమ్' ఇంకా ఉందన్న ఏంజెలో మాథ్యూస్
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో శ్రీలంక సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ తొలిసారి టైమ్డ్ ఔట్‌గా పెవిలియానికి చేరిన విషయం తెలిసిందే. క్రీజులోకి వచ్చి గార్డ్ తీసుకోకుండానే మళ్లీ హెల్మెట్ కోసం వేచి చూశాడు. ఇక బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అప్పీలు చేశాడు. దీంతో ఏంజెలో మాథ్యూస్‌ను అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు. ఈ నిర్ణయంతో మాథ్యూస్ తీవ్ర అసహనంతో డగౌట్ కు వెళ్లిపోయాడు. ఇక మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బంగ్లా జట్టు కెప్టెన్ షకీబ్ తీరుపై మాథ్యూస్ తీవ్ర విమర్శలు చేశాడు. తనకు ఇంకా సమయం ఉన్నా ఔట్‌గా ప్రకటించారని, కావాలంటే తన తగ్గర వీడియో ఆధారాలు ఉన్నాయని మాథ్యూస్ పేర్కొన్నాడు.
షకీబ్ తీరు అవమానకరం
తానేమీ తప్పు చేయలేదని, బ్యాటింగ్ కోసం రెండు నిమిషాల్లోపే సిద్ధమయ్యాయనని, అయితే హెల్మెట్ సరిగా లేదని గుర్తించానని, ఇదే విషయం ఆటగాళ్లకు, అంపైర్లకు చెప్పానని మాథ్యూస్ తెలిపాడు. షకీబ్, బంగ్లా జట్టు నుంచి అవమానకర రీతిలో ప్రతిస్పందన వచ్చిందని, ఇలా ప్రవర్తించడం చాలా తప్పు అని, ఆ జట్టు దిగజారిపోయిందని చెప్పాడు. తనకు ఇంకా ఐదు సెకన్ల సమయం మిగిలే ఉందని, తన దగ్గర వీడియో ఆధారాలున్నాయని, అందుకే ఇదంతా వారి కామన్ సెన్స్ కే వదిలేస్తున్నానని మాథ్యూస్ వివరించాడు. అయితే బంగ్లా వ్యవహరించిన తీరు మాత్రం తనను షాక్ కు గురి చేసిందని, మరే ఏ జట్టు కూడా ఇలా ఆలోచించదని వ్యాఖ్యానించాడు.