IND vs SA: మా డబ్బులు మాకివ్వండి: మ్యాచ్ రద్దుపై అభిమానుల ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
టీమ్ ఇండియా - దక్షిణాఫ్రికా జట్ల మధ్య బుధవారం లఖ్‌నవూలో జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ పొగమంచు ప్రభావంతో పూర్తిగా రద్దైంది. టాస్ కూడా పడకముందే మ్యాచ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. సాయంత్రం నుంచి అంపైర్లు పలుమార్లు మైదానాన్ని పరిశీలించారు. చివరిసారిగా రాత్రి 9.25 గంటలకు గ్రౌండ్‌ను తనిఖీ చేసిన అనంతరం, ఆట నిర్వహణ సాధ్యం కాదని నిర్ణయించి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో స్టేడియానికి వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.
వివరాలు
బీసీసీఐ రీఫండ్ పాలసీ
మ్యాచ్ రద్దుపై పలువురు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి టిక్కెట్లు కొనుగోలు చేశామని, వాటికి చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అయితే కొందరు మాత్రం డబ్బులు రీఫండ్ చేయడం మాత్రమే సరిపోదని, తాము టీమ్ ఇండియా మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలనే ఆశతో వచ్చామని వాపోయారు. లఖ్‌నవూలో గత కొన్ని రోజులుగా ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో, మ్యాచ్‌ను రాత్రి కాకుండా మధ్యాహ్నం వేళల్లో నిర్వహించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. బీసీసీఐ రీఫండ్ పాలసీ ప్రకారం ఒక్క బంతి కూడా పడకుండా మ్యాచ్ రద్దైతే, సంబంధిత టికెట్ ధరను తిరిగి చెల్లించే అవకాశం ఉంది.
వివరాలు
టీమ్ ఇండియా 2-1తో ముందంజలో..
ఈ సిరీస్‌లో ఇప్పటికే అనారోగ్య కారణాలతో అక్షర్ పటేల్, గాయం కారణంగా శుభ్‌మన్ గిల్ నాలుగో, అయిదో టీ20లకు దూరమైన విషయం తెలిసిందే. ఇక అయిదో టీ20 మ్యాచ్ డిసెంబర్ 19, శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ప్రస్తుతానికి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్ ఇండియా 2-1తో ముందంజలో ఉంది. నాలుగో టీ20 రద్దు కావడంతో భారత జట్టు సిరీస్‌ను కోల్పోయే అవకాశం లేకుండా పోయింది. అయిదో టీ20లో భారత్ గెలిస్తే సిరీస్ 3-1తో టీమ్ ఇండియా ఖాతాలో చేరుతుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా విజయం సాధిస్తే సిరీస్ 2-2తో సమంగా ముగియనుంది.