Loading...
Harmanpreet Kaur: భారత మహిళా క్రికెట్‌లో మరో శకం ముగిసింది.. కెప్టెన్సీకి హర్మన్‌ప్రీత్‌ వీడ్కోలు!
భారత మహిళా క్రికెట్‌లో మరో శకం ముగిసింది.. కెప్టెన్సీకి హర్మన్‌ప్రీత్‌ వీడ్కోలు!

Harmanpreet Kaur: భారత మహిళా క్రికెట్‌లో మరో శకం ముగిసింది.. కెప్టెన్సీకి హర్మన్‌ప్రీత్‌ వీడ్కోలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 06, 2026
12:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మహిళా క్రికెట్‌ జట్టులో ఒక శకం ముగిసింది. జట్టును విజయపథంలో నడిపించిన సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తన సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసింది. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతున్నట్లు ఇవాళ వెల్లడించింది. ఇటీవలే ముగిసిన ఆసియా క్రీడలు 2026లో భారత జట్టుకు వరుసగా రెండోసారి స్వర్ణ పతకాన్ని అందించిన కొద్ది రోజులకే హర్మన్‌ప్రీత్‌ ఈ నిర్ణయం తీసుకోవడం క్రీడా వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సందర్భంగా హర్మన్‌ప్రీత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘమైన, భావోద్వేగభరితమైన పోస్ట్‌ చేసింది. 'కెప్టెన్సీ నుంచి వైదొలగాలన్న నిర్ణయం అంత సులభం కాదు. ఎన్నో ఏళ్ల జ్ఞాపకాలు, త్యాగాలు, జట్టు ఎదుగుదల కోసం తీసుకున్న కఠిన నిర్ణయాల సమాహారం ఈ ప్రయాణం.

వివరాలు

సాధారణ ప్లేయర్ గా జట్టులో కొనసాగుతా

ఈ రోజు కెప్టెన్సీని వీడుతున్నప్పుడు నా హృదయం భావోద్వేగాలతో నిండి ఉంది. అదే సమయంలో నా మనసు ప్రశాంతంగా ఉంది.

ఎందుకంటే నా జట్టు ఇప్పుడు చాలా మంచి స్థితిలో ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని హర్మన్‌ప్రీత్‌ పేర్కొంది. ఇకపై తాను సాధారణ ప్లేయర్‌గా జట్టులో కొనసాగుతానని హర్మన్‌ప్రీత్‌ స్పష్టం చేసింది.

తన కెప్టెన్సీ ప్రయాణంలో అండగా నిలిచిన సహచర క్రీడాకారిణులు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, బీసీసీఐ, కుటుంబ సభ్యులు, అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

వివరాలు

కౌర్‌ కెప్టెన్సీలో భారత మహిళల జట్టు చారిత్రక విజయాలు

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్సీలో భారత మహిళల జట్టు పలు చారిత్రక విజయాలను సాధించింది. ముఖ్యంగా 2025లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌ను గెలిచి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.

అయితే కొంతకాలంగా భారత మహిళల జట్టులో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన తదుపరి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

అయితే కొత్త కెప్టెన్‌పై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో భారత మహిళా క్రికెట్‌లో ఒక విజయవంతమైన అధ్యాయం ముగిసినట్లయింది.

ADVERTISEMENT