Squash World Cup: క్రీడా చరిత్రలో మరో మైలురాయి.. స్క్వాష్ ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న భారత్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌కు ఇది నిజంగా ప్రపంచకప్‌ల కాలమే అనిపిస్తోంది. క్రికెట్‌లో మహిళల వన్డే ప్రపంచకప్, అంధుల ప్రపంచకప్‌ను ఇప్పటికే కైవసం చేసుకున్న భారత్.. తాజాగా స్క్వాష్‌లో కూడా ప్రపంచకప్‌ను సొంతం చేసుకుని మరో ఘనతను ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు స్క్వాష్‌లో వ్యక్తిగతంగా కొన్ని విజయాలు సాధించినా జట్టు స్థాయిలో భారత్ సత్తా చాటిన సందర్భాలు చాలా అరుదు. ఆ లోటును తీర్చుతూ జోష్న చిన్నప్ప, అనాహత్ సింగ్, అభయ్ సింగ్, సెంథిల్ కుమార్‌లతో కూడిన మిక్స్‌డ్ జట్టు తొలిసారి ప్రపంచకప్‌ను గెలిచి చరిత్ర సృష్టించింది. ఎన్నో ఏళ్లుగా ఈఆట ఆడుతున్నప్పటికీ సాధ్యం కాని విజయం ఇప్పుడు సాధ్యమైందంటే ఈజట్టు ప్రత్యేకతే కారణం. ఈచారిత్రక విజయం వెనుక ఉన్న నలుగురు ఆటగాళ్ల ప్రస్థానాన్ని ఒక్కసారి చూద్దాం.
Details
అనుభవానికి విజయపు రంగు
జోష్న చిన్నప్ప భారత స్క్వాష్‌కు చిరకాలంగా గుర్తుగా నిలుస్తున్న పేరు. టెన్నిస్‌లో సానియా మీర్జా, చెస్‌లో కోనేరు హంపి, హారిక మాదిరిగానే తన ఆటలో భారత్‌కు దీర్ఘకాలం సేవలందించిన క్రీడాకారిణి ఆమె. 39 ఏళ్ల వయసులో కెరీర్ చివరి దశలో ప్రపంచకప్‌ను ముద్దాడి జోష్న తన ప్రయాణానికి గౌరవప్రదమైన ముద్ర వేసింది. అనుభవాన్ని యువ క్రీడాకారులకు పంచుతూ భారత్ విజయంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ప్రత్యేకంగా ఫైనల్లో టాప్‌సీడ్ హాంకాంగ్‌ను 3-0తో ఓడించడంలో జోష్న ఇచ్చిన ప్రేరణ అమూల్యమైనది. తొలి సింగిల్స్‌లో తనకంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న కయీ లీని ఓడించి భారత్‌కు శుభారంభం అందించింది.
Details
యువ సంచలనం అనాహత్
2003లో ప్రొఫెషనల్ ఆటగాడిగా మారిన జోష్న.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 2 స్వర్ణాలు, 3 కాంస్యాలు, కామన్వెల్త్ క్రీడల్లో ఒక స్వర్ణం, ఆసియా క్రీడల్లో 2 రజతాలు, 3 కాంస్యాలు, ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించింది. ఇక భారత స్క్వాష్‌కు కొత్త ఊపునిచ్చిన యువతీరం అనాహత్ సింగ్. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ టోర్నీల్లో నిలకడగా రాణిస్తూ తన ప్రత్యేకతను చాటుతోంది. దిల్లీకి చెందిన అనాహత్ క్రీడా కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ హాకీ ప్లేయర్లే. పీవీ సింధు స్ఫూర్తితో తొలుత బ్యాడ్మింటన్ ఆడిన అనాహత్.. అక్క సమైరా స్క్వాష్ ఆడుతుండడంతో ఆ ఆట వైపు మళ్లింది. సౌరభ్ ఘోషల్ శిక్షణలో ఆమె ఆట మరింత పదును పెట్టుకుంది.
Details
పిన్న వయస్కురాలిగా గుర్తింపు
2019లో బ్రిటిష్ జూనియర్ ఓపెన్ గెలిచినప్పటి నుంచి అనాహత్ ప్రయాణం వేగం పుంజుకుంది. అదే ఏడాది డచ్ జూనియర్ ఓపెన్, 2021లో యుఎస్ ఓపెన్ నెగ్గింది. 2022లో కేవలం 14 ఏళ్ల వయసులోనే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొని భారత్ తరఫున బరిలో దిగిన పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది. 2022 ఆసియా క్రీడల్లో టీమ్, మిక్స్‌డ్ విభాగాల్లో కాంస్యాలు సాధించింది. ఈ ఏడాది అనాహత్ కెరీర్‌లో కీలక మలుపు. ప్రపంచకప్‌తో పాటు ఆసియా ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచింది. ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యాన్ని తన ఖాతాలో వేసుకుంది.
Details
చెన్నై నుంచి వెలుగులోకి వచ్చిన హీరోలు
భారత జట్టు చరిత్రాత్మక విజయంలో చెన్నైకి చెందిన అభయ్ సింగ్, సెంథిల్ కుమార్‌లు కూడా కీలక పాత్ర పోషించారు. తమిళనాడులోని సేలంకు చెందిన 27 ఏళ్ల సెంథిల్ కుమార్‌ది పూర్తిగా క్రీడా నేపథ్య కుటుంబం. తల్లి ప్రియదర్శిని జాతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్, తండ్రి రామస్వామి జాతీయ బాస్కెట్‌బాల్ ఆటగాడు. ఈ రెండు ఆటలను వదిలి సెంథిల్ స్క్వాష్‌ను ఎంచుకున్నాడు. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో స్క్వాష్ ఆడుతూ అదే తన కెరీర్‌గా మార్చుకున్నాడు. 2022, 2024 ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో టీమ్, డబుల్స్‌లో స్వర్ణాలు గెలిచాడు. సింగిల్స్‌లో 2023లో రజతం, 2025లో కాంస్యాలు సాధించాడు.
Details
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 29వ స్థానం
తక్కువ కాలంలోనే భారత జట్టులోకి దూసుకొచ్చి స్టార్‌గా ఎదిగిన ఆటగాడు అభయ్ సింగ్. 27ఏళ్ల ఈ చెన్నై కుర్రాడు జేమ్స్ విల్‌స్ట్రాప్, హరీందర్ పాల్ సింగ్ శిక్షణలో తన ఆటను మెరుగుపర్చుకున్నాడు. సింగిల్స్‌లో స్థిరంగా రాణిస్తున్న అభయ్ ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 29వ స్థానంలో ఉన్నాడు. 2022 ప్రపంచకప్‌లో కాంస్యం గెలిచిన మిక్స్‌డ్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్న అతడు.. ఇప్పుడు స్వర్ణాన్ని ముద్దాడాడు. ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో (2022, 2024)టీమ్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో మొత్తం అయిదు స్వర్ణాలు అతడి ఖాతాలో ఉన్నాయి. 2019దక్షిణ ఆసియా క్రీడలు, 2016 ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో సింగిల్స్‌లో కాంస్యాలు కూడా గెలిచాడు. ఈ నలుగురి సమిష్టి ప్రదర్శనతో భారత్ స్క్వాష్ ప్రపంచకప్‌ను గెలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించింది.