Ishan Kishan: సెలక్టర్లు చూస్తున్నారా?.. ఇషాన్ కిషన్ అదిరిపోయే రీ ఎంట్రీ!
ఈ వార్తాకథనం ఏంటి
వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన అరుదైన భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ ఒకడు. టెస్టులు, టీ20ల్లోనూ అతడి గణాంకాలు ఆకట్టుకునేలా ఉండటంతో ఒక దశలో భారత క్రికెట్‌లో కాబోయే స్టార్‌గా అతడిపై భారీ అంచనాలేర్పడ్డాయి. అయితే అలాంటి ఆటగాడు దాదాపు రెండేళ్ల పాటు టీమ్‌ఇండియా దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాడు. బీసీసీఐ కాంట్రాక్టును కోల్పోవడంతో పాటు, ఐపీఎల్‌లోనూ ఫామ్ కోల్పోయాడు. దీంతో అతడి అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టేనని చాలా మంది భావించారు. కానీ, టీ20 ప్రపంచకప్‌కు ముందు కీలకంగా మారిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తూ మళ్లీ భారత జట్టులోకి దూసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.
Details
22 ఏళ్ల వయస్సులో భారత జట్టులోకి ఎంట్రీ
ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించిన ఇషాన్ కిషన్ కేవలం 22 ఏళ్ల వయసులోనే భారత జట్టులో చోటు సంపాదించాడు. మూడు ఫార్మాట్లలోనూ దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 32 టీ20 మ్యాచ్‌ల్లో 26 సగటుతో 796 పరుగులు చేయగా, 27 వన్డేల్లో 42.4 సగటుతో 933 పరుగులు సాధించాడు. రెండు టెస్టులు ఆడిన అతడు 78 సగటుతో 78 పరుగులు నమోదు చేశాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించి, విరాట్ కోహ్లీకి కూడా సాధ్యం కాని ఘనతను అందుకోవడంతో ఒక దశలో ఇషాన్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. అయితే 2023 దక్షిణాఫ్రికా పర్యటన సమయంలో మానసికంగా సిద్ధంగా లేనని చెబుతూ మధ్యలోనే స్వదేశానికి తిరిగిరావడం అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది.
Details
టీమిండియాలో స్థానంలో కోల్పోయిన ఇషాన్
ఆ తర్వాత బీసీసీఐ సూచనలకు విరుద్ధంగా దేశవాళీ క్రికెట్‌కు దూరంగా ఉండి ఐపీఎల్ ప్రాక్టీస్‌పైనే దృష్టి పెట్టడం మరింత ప్రతికూలంగా మారింది. ఈ పరిణామాలతో జట్టు యాజమాన్యం, సెలక్షన్ కమిటీ అతడిని పక్కన పెట్టాయి. ఫలితంగా అతడు టీమ్‌ఇండియాలో స్థానం కోల్పోయాడు. బీసీసీఐ కాంట్రాక్టుల్లోనూ పేరు లేకుండా పోయింది. దేశవాళీ క్రికెట్‌లోనూ అతడి ఫామ్ ఆశించిన స్థాయిలో కొనసాగలేదు. ఈ ఏడాది ఐపీఎల్‌ను సెంచరీతో ప్రారంభించిన ఇషాన్ ఆ తర్వాత ఫామ్ కోల్పోయాడు. అయితే రంజీ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శనతో మళ్లీ లయను అందుకున్నాడు. తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అయితే పూర్తిగా చెలరేగిపోయాడు. ఈ టోర్నీలో 2 శతకాలు, 2 అర్ధశతకాలు సహా మొత్తం 517 పరుగులు సాధించాడు.
Details
నిలకడగా రాణిస్తే చోటు లభించే అవకాశం
అతడి సగటు 57.44 కాగా, స్ట్రైక్ రేట్ 197.32గా ఉండటం విశేషం. టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలవడం మరో ప్రత్యేకత. ముఖ్యంగా కీలకమైన ఫైనల్లో మెరుపు సెంచరీతో జట్టును గెలిపించడంతో సెలక్టర్ల దృష్టి అతడిపై పడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు భారత జట్టులో చోటు కోసం ఇషాన్ కిషన్ బలమైన పోటీదారుగా మారాడు. ఆ అవకాశం దక్కించుకుని, నిలకడగా రాణిస్తే టీ20 ప్రపంచకప్‌లోనూ అతడిని చూసే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.