Arjun Tendulkar: సచిన్ ఇంట పెళ్లి సందడి.. అర్జున్-సానియా వివాహ ముహూర్తం ఖరారు
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగడానికి డేట్ ఫిక్స్ అయ్యింది. ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ త్వరలోనే సానియా చందోక్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. పలు నివేదికల ప్రకారం.. ఇప్పటికే వీరి పెళ్లికి డేట్ ఫిక్స్ అయ్యిందని సమాచారం. గత ఏడాది ఆగస్టు 2025లో అతి కొద్ది మంది సమక్షంలో ఈ ఇరువురు నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జంట పెళ్లి ముహూర్తంపై స్పష్టత వచ్చినట్టు సమాచారం. వివరాల ప్రకారం, అర్జున్ టెండూల్కర్ - సానియా చందోక్ వివాహం 2026 మార్చి 5న జరగనుంది. పెళ్లికి ముందు జరిగే సంప్రదాయ వేడుకలు మార్చి 3 నుంచే ప్రారంభం కానున్నాయి.
వివరాలు
ముంబైలోనే వివాహ కార్యక్రమాలు
సానియా చందోక్ ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రవి ఘై మనవరాలు. అంతేకాకుండా, ఆమెకు పెంపుడు జంతువుల సంరక్షణకు సంబంధించిన సొంత బ్రాండ్ కూడా ఉండటం విశేషం. సానియా కుటుంబానికి, టెండూల్కర్ కుటుంబానికి చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ వివాహ కార్యక్రమాలు ముంబైలోనే నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకలకు ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు, అలాగే క్రికెట్ రంగానికి చెందిన కొద్దిమంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.
వివరాలు
లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో అర్జున్
భారీ ఆర్భాటాలకు దూరంగా, పరిమిత అతిథులతో వేడుకలను నిర్వహించాలని కుటుంబాలు నిర్ణయించినట్టు నివేదికలు చెబుతున్నాయి. అర్జున్ టెండూల్కర్ క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే, ఇటీవలే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు నుంచి లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2026 సంవత్సరం అర్జున్‌కు వృత్తిపరంగానే కాదు,వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో ప్రత్యేకంగా ఉండనుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు ఐపీఎల్ కొత్త సీజన్‌కు సిద్ధమవుతూనే, మరోవైపు పెళ్లి ఏర్పాట్లలో కూడా బిజీగా ఉన్నారని సమాచారం.