
US Open 2025: యుఎస్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ విజేతగా అరీనా సబలెంక.. మరో గ్రాండ్‌స్లామ్ కైవసం!
ఈ వార్తాకథనం ఏంటి
బెలారస్ స్టార్ అరీనా సబలెంక యుఎస్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. శనివారం జరిగిన ఫైనల్లో అమెరికా క్రీడాకారిణి, ఎనిమిదో సీడ్ అమండా అనిసిమోవాపై 6-3, 7-6(3) తేడాతో విజయం సాధించారు. కేవలం ఒక గంటా 34 నిమిషాల్లో మ్యాచ్ ముగిసింది. రెండు సెట్లలోనూ సబలెంక తన ఆటతీరుతో ఆధిపత్యం చెలాయించగా, 24 ఏళ్ల అనిసిమోవా 17 ఏళ్ల సబలెంక ముందు తేలిపోయారు. ఈ విజయంతో సబలెంక తన నాలుగో గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఇందులో రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లు, రెండు యుఎస్ ఓపెన్‌లు ఉన్నాయి. టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ తర్వాత యుఎస్ ఓపెన్ టైటిల్‌ను కాపాడుకున్న తొలి క్రీడాకారిణిగా సబలెంక రికార్డు సృష్టించారు.
Details
మరో గ్రాండ్ స్లామ్ గెలవడం సంతోషంగా ఉంది
మరోవైపు ఇగా స్వియాటెక్, నవోమి ఒసాకాలను ఓడించి ఫైనల్ వరకు వచ్చిన అనిసిమోవా, టాప్ సీడ్ సబలెంకను మాత్రం మట్టికరిపించలేకపోయారు. మరో గ్రాండ్ స్లామ్ గెలవడం సంతోషంగా ఉందని, ఈ విజయంపై గర్వంగా ఉందని సబలెంక స్పందించారు. ఇక పురుషుల విభాగంలో యుఎస్ ఓపెన్ 2025 సింగిల్స్ ఫైనల్ నేడు జరగనుంది. టాప్ సీడ్ యానిక్ సినర్, రెండో సీడ్ కార్లోస్ అల్కరాస్ తలపడనున్నారు. ఓపెన్ శకంలో ఒకే సీజన్లో కనీసం మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో అడుగుపెట్టిన తొలి జంటగా సినర్-అల్కరాస్ రికార్డుల్లో నిలిచారు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌ను అల్కరాస్ గెలవగా, వింబుల్డన్ టైటిల్‌ను సినర్ కైవసం చేసుకున్నారు. ఇప్పుడు యుఎస్ ఓపెన్ ట్రోఫీ ఎవరికి దక్కుతుందో ఆసక్తి నెలకొంది.