
Aswin: రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేసిన అశ్విన్.. హర్షిత్ రాణా పైనా ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత, భారత సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ మళ్లీ కొత్త సిరీస్ కోసం సిద్ధమవుతున్నారు. ఆస్ట్రేలియాతో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌కు భారత జట్టులో ఈ ఇద్దరికీ చోటు లభించింది. ఇరు క్రికెటర్లు వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నందున, వారు ఈ సిరీస్‌లో ఎలాంటి ప్రదర్శన చూపిస్తారనే విషయంలో అభిమానుల ఆసక్తి బాగా పెరిగింది. వచ్చే వన్డే ప్రపంచకప్‌లో ఆడాలనే లక్ష్యంతో వీరిద్దరూ ఉన్నారు. కెరీర్ చివరి దశలో ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు తగిన గౌరవం ఇవ్వాలని మాజీ భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించారు. అలాగే,ఆస్ట్రేలియాలోని ఈ పర్యటనలో ఎంపికైన హర్షిత్ రాణా గురించి కూడా అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
వారిద్దరి విషయంలోనైనా మెరుగైన రీతిలో వ్యవహరించాలి
"కాయిన్‌కు ఒకవైపు సెలక్షన్ కమిటీ.. మరోవైపు కోహ్లీ-రోహిత్.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు అనిపించింది.అయితే, ఇద్దరు సీనియర్ క్రికెటర్లు కెరీర్ చివరి దశలో ఉన్నారని మనం గుర్తించాలి. వారిద్దరి విషయంలోనైనా మెరుగైన రీతిలో వ్యవహరించాలి. అభిమానులు కూడా ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.మెనేజ్‌మెంట్ కొత్త యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు వస్తోంది. ఇది సమంజసమైన నిర్ణయం కానీ, సీనియర్లతో సరైన కమ్యూనికేషన్ ఉండాలి. భారత్ A జట్టులో ఆడితేనే వరల్డ్ కప్ జట్టులో చోటు ఉంటుందని వారిని ముందే తెలియజేయడం అవసరం. దేశవాళీలోనూ ఆడటానికి అవకాశమిచ్చి, వారిని గౌరవించాలి " అని అశ్విన్ వెల్లడించాడు.
వివరాలు
ఎవరూ అలా చేయొద్దు..
హర్షిత్ రాణా ఎంపికపై సోషల్ మీడియాలో విపరీత చర్చ జరుగుతున్న నేపథ్యంలో అశ్విన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. "హర్షిత్ రాణా ఎంపిక ఎలా జరిగిందనేది నేనూ తెలుసుకోవాలనుకుంటున్నా.ఈ విషయంలో రెండు ముఖ్యమైన అంశాలు చెప్పగలను. ఆస్ట్రేలియా గడ్డపై బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్ చేయగల ప్లేయర్ కావాలి. ఏంటి అతడు బ్యాటింగ్ చేస్తాడా? అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోవచ్చు. కాని, అతడు బ్యాటింగ్ చేయగలడని మేనేజ్‌మెంట్ విశ్వసిస్తోంది. ఎనిమిదవ స్థానంలో సమర్థవంతంగా పరుగులు చేయగల సామర్థ్యం అతనిలో ఉంది.
వివరాలు
ఎవరూ అలా చేయొద్దు..
హర్షిత్ రాణా బౌలింగ్ విషయంలోనూ నిస్సందేహంగా ప్రతిభావంతుడు. అందుకే, ప్రతి అభిమానిని కోరేది ఏంటంటే, వ్యక్తిగతంగా రాణాపై ట్రోల్ చేయరాదు, తప్పుడు వ్యాఖ్యలు చేయకూడదు. కొన్నిసార్లు, కేవలం నమ్మకంతో జట్టులోకి ఎంపిక చేయడం జరుగుతుంది. అతను అర్హుడా లేదా కాదు అనే విషయంలో తక్షణ నిర్ణయం చెప్పడం కష్టం. అతను కీలక పాత్ర పోషిస్తాడా లేదా అన్నది కూడా ఆ తర్వాతే స్పష్టమవుతుంది. కాబట్టి, ఎంపికపై నిరుపయోగమైన, ప్రతికూల కామెంట్లను చేయకూడదు," అని అశ్విన్ వ్యాఖ్యానించాడు.