LOADING...
IND vs SL: మరో పోరుకు సిద్ధమైన టీమిండియా.. ఆఖరి సూపర్‌-4 మ్యాచ్‌లో శ్రీలంకతో ఢీ 
మరో పోరుకు సిద్ధమైన టీమిండియా.. ఆఖరి సూపర్‌-4 మ్యాచ్‌లో శ్రీలంకతో ఢీ

IND vs SL: మరో పోరుకు సిద్ధమైన టీమిండియా.. ఆఖరి సూపర్‌-4 మ్యాచ్‌లో శ్రీలంకతో ఢీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 26, 2025
08:12 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్‌లో దూసుకుపోతున్నటీమిండియా మరో పోరుకు సిద్ధమవుతోంది. శుక్రవారం జరగబోయే నామమాత్ర సూపర్‌-4 చివరి పోరులో భారత జట్టు శ్రీలంకను ఎదుర్కోనుంది. ఇప్పటికే భారత్‌ ఫైనల్‌కు అర్హత సాధించగా, సూపర్‌-4లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన లంక మాత్రం పోటీలోనుంచి తప్పుకుంది. సూర్యకుమార్‌ యాదవ్‌ నాయకత్వంలోని భారత బృందం వరుస విజయాలతో దూసుకుపోతుండటంతో, లంకకు వారిని ఆపడం పెద్ద సవాలుగా మారింది. అయితే, ఫీల్డింగ్‌లోని లోపాలు మాత్రం భారత్‌కు తలనొప్పిగా మారాయి. ఇప్పటి వరకూ మన ఫీల్డర్లు పది క్యాచ్‌లను వదిలేశారు.

వివరాలు 

 ఈ మ్యాచ్‌లో శాంసన్‌ను మూడో స్థానంలోనే..

అదే సమయంలో బ్యాటింగ్‌ క్రమంలో సంజు శాంసన్‌ స్థానాన్ని ఖరారు చేయడం జట్టుకు మరో సమస్యగా మారింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడిని టాప్‌-7లో కూడా ఆడించలేకపోయారు.అక్షర్‌ పటేల్‌ కంటే ముందు కూడా సంజును పంపలేకపోతే, అతడిని జట్టులో ఉండి ఏం లాభం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బంగ్లాదేశ్‌పై దూబెను మూడో స్థానంలో పంపినా ఆశించిన ఫలితం రాలేదు. కాబట్టి ఈ మ్యాచ్‌లో శాంసన్‌ను మూడో స్థానంలోనే ప్రయత్నించే అవకాశం ఉంది. గతంలో గిల్‌కు బదులుగా అభిషేక్‌తో కలిసి ఓపెనింగ్‌ చేసే అవకాశం దక్కినప్పుడు శాంసన్‌ మంచి ప్రదర్శనే చేశాడు. అయితే ఈ టోర్నీలో పాకిస్థాన్‌తో అయిదో స్థానంలో కాస్త కష్టపడి ఆడాడు.

వివరాలు 

హార్దిక్‌ పాండ్య రాణించడం భారత్‌కు సానుకూలాంశమే

ఒమన్‌తో జరిగిన పోరులో మూడో స్థానంలో అర్ధశతకం చేసినా, పెద్దగా ఇంపాక్ట్‌ చూపించలేకపోయాడు. ఇక లంకపై అతడు ఎలా ఆడతాడో అన్నది ఆసక్తికరం. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ భీకర ఫామ్‌ మాత్రం భారత్‌కు విశేష ఆనందం కలిగిస్తోంది. ఇప్పటివరకు 200కుపైగా స్ట్రైక్‌రేట్‌తో 248 పరుగులు సాధించిన అభిషేక్‌ ఈ టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఓపెనర్‌ గిల్‌ కూడా మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. గత మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్య విలువైన ఇన్నింగ్స్‌ ఆడడం కూడా జట్టుకు శుభ సంకేతమే. అయితే కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ నుంచి ఇంకా మెరుగైన ప్రదర్శన అవసరమని భావిస్తున్నారు.

వివరాలు 

బంతితో రాణిస్తున్న  కుల్‌దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి 

బౌలింగ్‌ విభాగంలో కుల్‌దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి స్పిన్‌తో చక్కగా రాణిస్తున్నారు. గత మ్యాచ్‌లో బుమ్రా తన లయను తిరిగి అందుకున్నాడు. ఇక శ్రీలంక విషయానికి వస్తే, కనీసం ఈ మ్యాచ్‌లో గెలిచి గౌరవప్రదంగా టోర్నీ నుంచి తప్పుకోవాలని చూస్తోంది. కానీ అసాధారణంగా పుంజుకుంటే తప్ప ఆ జట్టు టీమ్‌ఇండియాను అడ్డుకోలేదు.