LOADING...
IND vs PAK : ఆసియా కప్ 2025.. గాయపడ్డ టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ 
ఆసియా కప్ 2025.. గాయపడ్డ టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్

IND vs PAK : ఆసియా కప్ 2025.. గాయపడ్డ టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 20, 2025
01:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ 2025లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. అబుదాబిలో శుక్రవారం ఒమన్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో భారత్ 21 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు వరుస విజయాలతోనే సూపర్-4లోకి చేరింది. ఈ ఘన విజయంతో భారత్ గ్రూప్-ఏలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. సూపర్-4లో భారత్ ఆదివారం పాకిస్థాన్‌తో ముఖాముఖి కావాల్సి ఉంది. అయితే, కీలక మ్యాచ్‌కు ముందే టీమిండియాకు షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఒమన్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. ఈ గాయం ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో చోటు చేసుకుంది. శివమ్ దూబె వేసిన ఓవర్‌లో హమీద్ మీర్జా భారీ షాట్ ఆడగా, గాల్లోకి వెళ్ళిన బంతిని అక్షర్ క్యాచ్ చేయాలనుకుంటూ ప్రయత్నించాడు.

Details

ప్రస్తుతానికి బాగానే ఉన్నట్లు సమాచారం

కానీ, ఈ ప్రయత్నంలో అక్షర్ బ్యాలెన్స్ కోల్పోయి తల నేలకు తగిలింది. వెంటనే నొప్పితో విలవిలాడిన అతడికి ఫిజియో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అక్షర్ మైదానం నుంచి బయటకు వెళ్ళిపోయాడు. మిగిలిన మ్యాచ్‌లో మళ్లీ అడుగుపెట్టలేదు. గత కొన్నాళ్లుగా అక్షర్ పటేల్ బంతి, బ్యాటింగ్ రెండింటిలోనూ జట్టుకు కీలకంగా మారాడు. అతను పాక్‌తో సూపర్-4 మ్యాచ్‌లో ఆడకపోవడం భారత్ కోసం పెద్ద సవాలు అవుతుంది. మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ అక్షర్ గాయం గురించి స్పందించారు. ప్రస్తుతానికి అతను బాగానే ఉన్నాడని చెప్పారు. అయితే, పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు మద్యలో కేవలం ఒక్క రోజు విరామం ఉండటంతో, అక్షర్ ఆడే అవకాశం సందేహాస్పదమని పేర్కొన్నారు.