LOADING...
IND vs PAK - Final: ఆసియా కప్‌ ఫైనల్‌.. భారత్‌-పాక్‌ పోరులో చరిత్ర పునరావృతమవుతుందా?
ఆసియా కప్‌ ఫైనల్‌.. భారత్‌-పాక్‌ పోరులో చరిత్ర పునరావృతమవుతుందా?

IND vs PAK - Final: ఆసియా కప్‌ ఫైనల్‌.. భారత్‌-పాక్‌ పోరులో చరిత్ర పునరావృతమవుతుందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 27, 2025
03:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్‌ 2025లో మిగతా ఐదు జట్లతో పోలిస్తే టీమిండియానే అత్యంత బలమైన జట్టుగా నిలిచింది. అజేయంగా ఫైనల్‌కు చేరుకున్న భారత్‌ మూడోసారి పాకిస్థాన్‌తో తలపడబోతోంది. ఇప్పటివరకు అన్ని అనుకూలంగానే ఉన్నా.. అభిమానులను ఒకే అంశం కలవరపెడుతోంది. ఈసారి ఆ 'చరిత్ర'ను తిరగరాయాలని అందరి ఆశ. ఈ టోర్నీకి 41ఏళ్ల చరిత్ర ఉంది. కానీ భారత్‌, పాకిస్థాన్‌ తొలిసారిగా ఫైనల్‌లో తలపడుతున్నాయి. భారత్‌ ఇప్పటివరకు ఎనిమిది సార్లు విజేతగా నిలవగా, పాకిస్థాన్‌ కేవలం రెండుసార్లే కప్‌ను గెలుచుకుంది. ప్రస్తుత ఫైనల్‌లోనూ భారత్‌ ఫేవరెట్‌గానే కనిపిస్తున్నా..గతంలో యూఏఈలో జరిగిన ఫైనల్‌ పోరుల ఫలితాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా యూఏఈ గడ్డపై పాక్‌తో ఐసీసీ టోర్నీల ఫైనల్‌ పోరాటాల్లో భారత్‌కు విజయాలు పెద్దగా లభించలేదు.

Details

ధోనీ కెప్టెన్సీ విజయ గాథ 

మొత్తంగా ఇరు జట్లు 10 ఫైనల్స్‌లో తలపడితే.. భారత్‌ కేవలం మూడుసార్లే విజయం సాధించింది. మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలోని భారత్‌ 2007 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై చారిత్రాత్మక విజయం సాధించింది. ఆ ఉత్కంఠభరిత పోరులో భారత్‌ కప్‌ను దక్కించుకుంది. అంతకుముందు 1998లో ఇండిపెండెన్స్‌ కప్‌ ఫైనల్‌లోనూ భారత్‌-పాక్‌ తలపడగా.. సౌరవ్‌ గంగూలీ అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌ అలవోకగా గెలిచింది. అలాగే 1985లో వరల్డ్‌ ఛాంపియన్‌షిప్ ఆఫ్‌ క్రికెట్‌ ఫైనల్‌లోనూ భారత్‌ పాక్‌పై ఘనవిజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. గమనార్హంగా ఈ మూడు విజయాలూ యూఏఈ వెలుపల జరిగిన ఫైనల్స్‌లోనే వచ్చాయి.

Details

ఏడుసార్లు పాక్‌ పైచేయి 

ఇక మరో ఏడు ఫైనల్స్‌లో మాత్రం భారత్‌పై పాక్‌ ఆధిపత్యం చెలాయించింది. చివరిసారిగా 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత్‌ను ఓడించి పాకిస్థాన్‌ కప్‌ గెలుచుకుంది. అదేవిధంగా 2008 ముక్కోణపు సిరీస్‌ (భారత్‌, పాక్‌, బంగ్లాదేశ్‌) ఫైనల్‌లోనూ, 1999లో పెప్సీ కప్‌, కోకకోలా కప్‌లలోనూ, 1994 ఆస్ట్రల్‌ కప్‌లోనూ, 1991 విల్స్‌ ట్రోఫీలోనూ, 1986 ఆస్ట్రల్‌ కప్‌లోనూ పాక్‌ విజయం సాధించింది.

Details

ఇప్పుడు మరో చారిత్రాత్మక ఫైనల్‌ 

ఇప్పటివరకు ఆసియా కప్‌ ఫైనల్‌లో భారత్‌-పాక్‌ ఢీ అంటే ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి, 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం టీమ్‌ఇండియాకు ఆసన్నమైంది.