
Asia Cup: ఆసియా కప్ ట్రోఫీ వివాదం: మోసిన్ నఖ్వీకి 'భుట్టో ఎక్సలెన్స్ గోల్డ్ మెడల్'!
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల ముగిసిన ఆసియా కప్ ఫైనల్‌లో జరిగిన ట్రోఫీ ప్రదానోత్సవ కార్యక్రమం సందర్భంగా భారత జట్టుతో చోటుచేసుకున్న వివాదం పాకిస్థాన్‌లో పెద్ద చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్, అంతర్గత వ్యవహారాల మంత్రిగా ఉన్న మొహ్సిన్ నఖ్వీ చూపించిన ధైర్యసాహసాలకు గాను ఆయనకు ప్రతిష్ఠాత్మకమైన 'షహీద్ జుల్ఫికర్ అలీ భుట్టో ఎక్సలెన్స్ గోల్డ్ మెడల్' అందజేయనున్నట్లు సింధ్, కరాచీ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ల అధ్యక్షుడు అడ్వకేట్ గులాం అబ్బాస్ జమాల్ ప్రకటించారు. ఆసియా కప్ ఫైనల్ అనంతరం ట్రోఫీని అందుకోవడాన్ని భారత ఆటగాళ్లు నిరాకరించడం అంతర్జాతీయంగా పెద్ద వివాదంగా మారింది.
Details
ట్రోఫీ తన దగ్గరే ఉంచుకుంటానని చెప్పిన నఖ్వీ
నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ స్వీకరించడానికి భారత జట్టు ముందుకు రాకపోవడాన్ని పాకిస్థాన్ వర్గాలు రాజకీయ అవమానంగా పరిగణించాయి. దీనిపై స్పందించిన మొహ్సిన్ నఖ్వీ, ట్రోఫీని తన దగ్గరే ఉంచుకుంటానని ప్రకటించారు. "భారత జట్టుకు నిజంగా కావాలంటే, వారు ఏసీసీ ప్రధాన కార్యాలయానికి వచ్చి తీసుకోవచ్చని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ ఘటనపై బీసీసీఐ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, తాను ఏ తప్పూ చేయలేదని, క్షమాపణ చెప్పే ప్రశ్నే రాదని నఖ్వీ స్పష్టంచేశారు. భారత్‌తో క్రీడా, రాజకీయ సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న సమయంలో నఖ్వీ చూపిన ఈ ధైర్యవంతమైన వైఖరి పాకిస్థాన్ గౌరవాన్ని కాపాడిందని నిర్వాహకులు కొనియాడారు.
Details
ఈ వేడుకకు ప్రధాన అతిథిగా పీపీపీ చైర్మన్
అందుకే ఆయనను ఈ గౌరవంతో సత్కరించాలని నిర్ణయించామని తెలిపారు. కరాచీలో జరగనున్న ఈ అవార్డు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకు ప్రధాన అతిథిగా పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీని ఆహ్వానించారు. ఆయన హాజరు ఖరారైన వెంటనే తేదీని ప్రకటించనున్నట్లు గులాం అబ్బాస్ జమాల్ తెలిపారు. "ఇది కేవలం క్రికెట్ వివాదం మాత్రమే కాదు; ఇది దేశ గౌరవం, సార్వభౌమత్వానికి సంబంధించిన విషయం" అని ఆయన అన్నారు.