ఆసియా గేమ్స్ 2023: మొదటి రోజే.. 3 మెడల్స్‌తో ఖాతా తెరిచిన ఇండియా
ఆసియా గేమ్స్ 2023లో ఇండియా పతకాల వేట మొదలుపెట్టింది. చైనాలోని హాంగ్జౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలీ మూడు పతకాలు చేరాయి. షూటింగ్, రోయింగ్ క్రీడల్లో భారత అథ్లెట్స్ రెండు సిల్వర్ మెడల్స్ అందుకున్నారు. దీంతో భారత పతకాల సంఖ్య రెండుకు చేరుకుంది. 10మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ ఈవెంట్ లో మహిళ అథ్లెట్స్ అయిన మెహులీ ఘోష్, రమిత, ఆషీ చౌక్సీ 1886 స్కోర్ తో రెండవ స్థానంలో నిలిచి రజత పథకాన్ని అందుకున్నారు. ఈ ఈవెంట్లో 1896 స్కోర్ తో బంగారు పతకాన్ని చైనా సాధించుకుంది.
క్రికెట్ లో మరో పతకం ఖాయం
ఇక పురుషుల రోయింగ్ లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ లో అర్జున్ లాల్, అరవింద్ సింగ్ అథ్లెట్లు రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ అందుకున్నారు. ఈ గేమ్ లో కూడా బంగారు పతకాన్ని చైనా సొంతం చేసుకుంది. ఆసియా గేమ్స్ 2023లో ఇండియాకు మరో పతకం కూడా ఖాయమైంది. మహిళల క్రికెట్లో టీమిండియా తన సత్తా చూపుతోంది. సెమీఫైనల్ లో బంగ్లాదేశ్ ను ఓడించి పతకాన్ని ఖాయం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ లో గెలిస్తే ఇండియాకు బంగారు పతకం వస్తుంది. ఓడిపోతే రజతం అందుతుంది. మొత్తానికి మొదటి రోజు ఆసియా గేమ్స్ లో ఇండియాకు మంచి శుభారంభం జరిగింది.