LOADING...
The Ashes 2025-26: మూడో యాషెస్ టెస్ట్ కోసం ఆస్ట్రేలియా,ఇంగ్లాండ్ ఆటగాళ్ళు చేతికి నల్లబ్యాండ్లు .. ఎందుకంటే? 
ఎందుకంటే?

The Ashes 2025-26: మూడో యాషెస్ టెస్ట్ కోసం ఆస్ట్రేలియా,ఇంగ్లాండ్ ఆటగాళ్ళు చేతికి నల్లబ్యాండ్లు .. ఎందుకంటే? 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 17, 2025
12:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

యాషెస్‌ సిరీస్‌ (The Ashes 2025-26)లో భాగంగా అడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్న వేళ భావోద్వేగ వాతావరణం నెలకొంది. సిడ్నీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం బోండీ బీచ్‌లో ఆదివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో (స్థానిక కాలమానం ప్రకారం) యూదుల హనుక్కా వేడుకను లక్ష్యంగా చేసుకుని దుండగులు జరిపిన కాల్పులు దేశాన్ని కలచివేశాయి. ఈ దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు పౌరులు గాయపడ్డారు. ఈ విషాద ఘటనపై సంతాపం ప్రకటిస్తూ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ క్రికెటర్లు మ్యాచ్‌లో చేతికి నల్ల బ్యాండ్లు ధరించారు.

వివరాలు 

సగం ఎత్తులో జాతీయ జెండాలు 

స్టేడియంలో జాతీయ జెండాలను సగం ఎత్తులో ఎగురవేశారు. భద్రతా దృష్ట్యా మైదానం లోపలతో పాటు బయట కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సాయుధ పోలీసుల గస్తీని పెంచి అప్రమత్తతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ సందర్భంగా క్రికెట్‌ ఆస్ట్రేలియా చీఫ్‌ టాడ్‌ గ్రీన్‌బర్గ్‌ స్పందిస్తూ,'క్రికెట్‌ ప్రపంచం మొత్తం బాధితుల పక్షాన నిలుస్తోంది. వారి కుటుంబాలు,స్నేహితులు,అలాగే యూదు సమాజానికి మా సంపూర్ణ మద్దతు ఉంది' అని తెలిపారు. సంఘటనా ప్రాంతానికి సమీపంలో నివసించే ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు.

వివరాలు 

మొత్తం ప్రపంచానికే చాలా బాధాకరమైన సంఘటన: బెన్‌ స్టోక్స్

'బోండీ బీచ్‌ మా ఇంటికి చాలా దగ్గర. తరచూ నా పిల్లలను అక్కడికి తీసుకెళ్తుంటాను. ఈ కాల్పుల వార్త నన్ను తీవ్ర భయాందోళనకు గురిచేసింది' అని పాట్‌ కమిన్స్‌ వాపోయాడు. ఇదే విషయంపై ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ స్పందిస్తూ,'ఇది ఆస్ట్రేలియాకు,సిడ్నీకి మాత్రమే కాదు.. మొత్తం ప్రపంచానికే చాలా బాధాకరమైన సంఘటన' అని అన్నారు. ఇక అడిలైడ్‌లో జరుగుతున్న మూడో టెస్టు విషయానికి వస్తే.. 65ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయి 269పరుగులు చేసింది. క్రీజులో అలెక్స్‌ క్యారీ 120 బంతుల్లో 85పరుగులు (7 ఫోర్లు, 1 సిక్స్‌) చేసి నిలకడగా ఆడుతున్నాడు. అతనితో పాటు పాట్‌ కమిన్స్‌ 14 బంతుల్లో 11 పరుగులు (1 ఫోర్‌)తో క్రీజులో ఉన్నాడు.

Advertisement