IPL 2026: పంజాబ్‌పై తొలి హాఫ్ సెంచరీ.. ఐపీఎల్‌లో 2 వేల పరుగులు పూర్తి చేసిన అక్షర్ పటేల్
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసిన అక్షర్ 30 బంతుల్లో 56 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ఐపీఎల్ కెరీర్‌లో ఇది అతనికి నాలుగో అర్ధశతకం కాగా, పంజాబ్ కింగ్స్‌పై తొలి హాఫ్ సెంచరీగా నిలిచింది. 211 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన వేళ క్రీజ్‌లోకి వచ్చిన అక్షర్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. ట్రిస్టన్ స్టబ్స్‌తో నాలుగో వికెట్‌కు 41 పరుగులు,డేవిడ్ మిల్లర్‌తో 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గాడిలో పెట్టాడు.
వివరాలు
ఐపీఎల్‌లో 2,000 పరుగుల మైలురాయిని దాటిన అక్షర్
ఈ మ్యాచ్‌లో అక్షర్ మరో అరుదైన ఘనత కూడా అందుకున్నాడు. తన ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేరుకున్న సమయంలో ఐపీఎల్‌లో 2,000 పరుగుల మైలురాయిని దాటాడు. ఈ ఫీట్ సాధించిన 54వ బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాదు, ఐపీఎల్ చరిత్రలో 2,000 పరుగులు, 100 వికెట్ల డబుల్ పూర్తి చేసిన మూడో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అతనికంటే ముందు రవీంద్ర జడేజా, ఆండ్రీ రస్సెల్ మాత్రమే ఈ ఘనత సాధించారు. 2014లో చెన్నై సూపర్ కింగ్స్ పై ఐపీఎల్ అరంగేట్రం చేసిన అక్షర్ ఇప్పటివరకు 174 మ్యాచ్‌ల్లో 2,016 పరుగులు చేశాడు. 132కు పైగా స్ట్రైక్‌రేట్‌తో నాలుగు అర్ధశతకాలు నమోదు చేశాడు. బౌలింగ్‌లో కూడా 138 వికెట్లు తీసి ఆల్‌రౌండర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.