Babar Azam: టీ20ల్లో అత్యధిక డకౌట్ల జాబితాలో మూడో స్థానానికి చేరిన బాబర్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం ఇటీవల పెద్ద విరామం తర్వాత సెంచరీతో మళ్లీ రాణించినట్టే కనిపించాడు. కానీ ఆ ఉత్సాహం ఎక్కువ రోజులు నిలవలేదు. మంగళవారం జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ చేరి, తన పేరుతో ఓ అవాంఛిత రికార్డును జత చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక డకౌట్లు పొందిన పాకిస్థాన్ ఆటగాళ్ల జాబితాలో,బాబర్ ఇప్పుడు విధ్వంసక ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదిని కూడా అధిగమించాడు. రావల్పిండి వేదికగా జరిగిన ట్రై-సిరీస్ తొలి మ్యాచ్‌లో, 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బాబర్ ఆజం కేవలం మూడు బంతులే ఎదుర్కొని, బ్రాడ్ ఇవాన్స్ బౌలింగ్‌కు ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔటయ్యాడు.
వివరాలు
గత ఆరు ఇన్నింగ్స్‌లలో బాబర్‌కు ఇది మూడో డకౌట్
ఈ డకౌట్ అతనికి టీ20ల్లో తొమ్మిదవది. దీంతో, ఎనిమిది డకౌట్లున్న అఫ్రిదిని దాటి బాబర్ మూడో స్థానాన్ని ఆక్రమించాడు. మొదటి స్థానంలో సైమ్ అయూబ్, ఉమర్ అక్మల్ తలో 10 డకౌట్లతో ఉన్నారు. అదీ కాక, గత ఆరు టీ20 ఇన్నింగ్స్‌లలో ఇది బాబర్‌కు మూడో డకౌట్ కావడం జట్టు మేనేజ్‌మెంట్‌కి ఆందోళన కలిగిస్తోంది. పాక్ బ్యాటింగ్‌కు ముఖ్య ఆధారంగా భావించే అతడు ఇలా వరుసగా విఫలమవడం ఆందోళనకరమే. రాబోయే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని జట్టు సిద్ధమవుతున్న ఈ దశలో, కీలక ఆటగాడు ఫామ్ కోల్పోవడం పాకిస్థాన్ అవకాశాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది.