Virat Kohli: విరాట్ రీఎంట్రీ మ్యాచ్‌కు బ్యాడ్ న్యూస్.. ఫ్యాన్స్‌కు అనుమతి లేదు
ఈ వార్తాకథనం ఏంటి
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 15 ఏళ్ల విరామం తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగనున్నాడు. చివరిసారిగా 2010 ఫిబ్రవరి 18న ఈ టోర్నీలో ఆడిన కోహ్లీ, ఇన్నేళ్ల తర్వాత మళ్లీ పాల్గొనడం అభిమానుల్లో భారీ ఆసక్తిని రేపుతోంది. డిసెంబరు 24 నుంచి 2025-26 విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుండగా, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆంధ్ర - దిల్లీ జట్లు తమ తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. దిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లీ ఇప్పటికే సోమవారం రాత్రి బెంగళూరు చేరుకున్నాడు. అయితే కోహ్లీ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే అభిమానులకు నిరాశే ఎదురైంది.
Details
ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం
చిన్నస్వామి స్టేడియంలో విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA)కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెండు స్టాండ్లు తెరిచి 2,000 నుంచి 3,000 మంది అభిమానులను అనుమతించాలని కేఎస్‌సీఏ ప్రతిపాదన పెట్టినప్పటికీ, భద్రతా కారణాలను చూపుతూ ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA) కమిషనర్ నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌తో పాటు అగ్నిమాపక, అత్యవసర సేవలు, ఆరోగ్యశాఖ అధికారులూ సభ్యులుగా ఉన్నారు.
Details
తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి
ఈ కమిటీ త్వరలో చిన్నస్వామి స్టేడియాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రేక్షకుల అనుమతిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. గతంలో ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్‌గా నిలిచిన అనంతరం చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట చోటుచేసుకుని 11 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఆ ఘటన తర్వాత స్టేడియంలో ఎలాంటి మ్యాచ్‌లూ నిర్వహించలేదు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో, కోహ్లీ రీఎంట్రీపై ఆసక్తి ఉన్నప్పటికీ అభిమానులు స్టేడియానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.