Tamim Iqbal: పాక్‌పై బంగ్లాదేశ్ విజయం.. 2-1తో సిరీస్ సొంతం
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌తో జరిగిన మూడో వన్డే క్రికెట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు 11 పరుగుల తేడాతో రసవత్తర విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో తమ ఖాతాలో వేసుకుంది. ఓపెనర్ తాంజిద్ హసన్ (107) అద్భుత శతకంతో మెరిసి జట్టుకు బలమైన పునాది వేశాడు. అలాగే పేసర్ తస్కిన్ అహ్మద్ (4/49) కీలక వికెట్లు తీసి బంగ్లాదేశ్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.
వివరాలు
తొలి శతకం నమోదు
మిర్పూర్‌లోని షేర్ బంగ్లా జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 290 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ తాంజిద్ హసన్ తన వన్డే కెరీర్‌లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. అతను 107 బంతుల్లో 7 సిక్సర్లు, 6 ఫోర్లతో 107 పరుగులు చేశాడు. ఆయనకు తోడుగా తౌహిద్ హృదయ్ (48 నాటౌట్), కెప్టెన్ లిటన్ దాస్ (41) కూడా మంచి ఇన్నింగ్స్ ఆడారు. పాకిస్థాన్ బౌలర్లలో హారిస్ రవూఫ్ 3 వికెట్లు తీసి రాణించాడు.
వివరాలు
పాక్ చివరి వరకూ పోరాటం
తర్వాత 291 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు బంగ్లాదేశ్ పేస్ బౌలర్ల దాడికి తట్టుకోలేక ప్రారంభంలోనే ఇబ్బందులు ఎదుర్కొంది. కేవలం 82 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఈ సమయంలో కెప్టెన్ సల్మాన్ అలీ అఘా (106) అద్భుత శతకంతో జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశాడు. 98 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో పాకిస్థాన్‌ను విజయానికి దగ్గరగా తీసుకువచ్చాడు. అయితే కీలక సమయంలో సల్మాన్ అలీ అఘాను ఔట్ చేసిన తస్కిన్ అహ్మద్ మ్యాచ్‌ను మళ్లీ బంగ్లాదేశ్ వైపు మళ్లించాడు. చివరికి పాకిస్థాన్ 50 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌట్ అయ్యింది.