LOADING...
BCCI: వరుసగా రెండో సంవత్సరం పడిపోయిన ఐపీఎల్ విలువ.. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న బీసీసీఐ 
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న బీసీసీఐ

BCCI: వరుసగా రెండో సంవత్సరం పడిపోయిన ఐపీఎల్ విలువ.. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న బీసీసీఐ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2025
01:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు.. ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. కారణం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024, 2025 సీజన్లలో తన మొత్తం వ్యాపార విలువ (ఎకోసిస్టమ్ విలువ)లో గణనీయమైన తగ్గుదల చోటుచేసుకున్నట్లు సమాచారం. 2008లో IPL ప్రారంభమైనప్పటి నుంచి, భారతదేశం క్రికెట్ ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా ఎదిగింది. ఆటలో కొత్త రీతిని తీసుకువచ్చిన ఈ లీగ్, ఇప్పుడు BCCI గౌరవ చిహ్నంగా చెప్పుకోవచ్చు. బుధవారం విడుదలైన D&P Advisory నివేదిక ప్రకారం, ప్రపంచంలోనే అతిపెద్ద, ధనిక బోర్డు ఈ T20 లీగ్‌ విలువ 2024 నుంచి 2025 మధ్య దాదాపు 8 శాతం తగ్గిందని పేర్కొంది. "

వివరాలు 

ఆన్‌లైన్ గేమింగ్ బిల్లే IPL విలువ తగ్గడానికి ప్రధాన కారణం 

బియాండ్ 22 యార్డ్స్ -ది పవర్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్స్, ది ప్రైస్ ఆఫ్ రెగ్యులేషన్"పేరుతో విడుదలైన ఈ నివేదికలో, 2023లో 16వ సీజన్‌ సమయంలో గరిష్ట స్థాయికి చేరిన IPL విలువ,రెండో ఏడాది వరుసగా తగ్గిందని వెల్లడించింది. IPL వ్యాల్యుయేషన్ పడిపోవడానికి ప్రధాన కారణం, ఇటీవల లోక్‌సభ ఆమోదించిన"ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్ 2025"అని నివేదిక పేర్కొంది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత, ఫాంటసీ గేమింగ్ యాప్‌ డ్రీమ్11, భారత క్రికెట్ జట్టు ప్రధాన స్పాన్సర్‌గా తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. డ్రీమ్11తో పాటు మరో ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫార్మ్‌ మై11సర్కిల్ కూడా IPLలో ముఖ్య స్పాన్సర్లుగా ఉన్నాయి. డ్రీమ్11 అయితే చాలా ఫ్రాంచైజీలకు నేరుగా అనుబంధంగా ఉంది.

వివరాలు 

IPL మొత్తం ఎకోసిస్టమ్ విలువ, BCCI వార్షిక ఆదాయంలో పెద్ద భాగం

2008లో IPL మొదటి సీజన్‌ విలువ రూ.19,500 కోట్లుగా ఉండగా, 2025లో అది రూ.76,100 కోట్లకు చేరింది.. అంటే నాలుగు రెట్లు పెరిగింది. అయితే, 2023 సీజన్‌తో పోల్చితే (రూ.92,500 కోట్లు) దాదాపు 17.73 శాతం తగ్గుదల నమోదైంది. IPL మొత్తం ఎకోసిస్టమ్ విలువ, BCCI వార్షిక ఆదాయంలో పెద్ద భాగం. 2008లో BCCI ఆదాయం రూ.1,000 కోట్లకు కొంచెం ఎక్కువగా ఉండగా, గత ఏడాది అది రూ.9,742 కోట్లకు పెరిగింది. అయినప్పటికీ, IPL వ్యాల్యుయేషన్ తగ్గిపోవడం వల్ల భవిష్యత్తులో BCCI ఆర్థిక లెక్కల్లో కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.