Vaibhav Sooryavanshi: వైభవ్ భవిష్యత్తుపై బీసీసీఐ ఫోకస్.. సచిన్‌లా ఎదగాలని సైకియా సూచన!
ఈ వార్తాకథనం ఏంటి
యువ సంచలనం, భారత క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రశంసల వర్షం కురిపించారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్‌ను ఆదర్శంగా తీసుకుని వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన, సుదీర్ఘమైన కెరీర్‌ను నిర్మించుకోవాలని సూచించారు. ఏదో ఒక సిరీస్ లేదా ఒక్క ఏడాది మాత్రమే కనిపించే వండర్ ప్లేయర్‌గా మిగిలిపోకుండా.. అంతర్జాతీయ క్రికెట్‌లో దీర్ఘకాలం రాణించేలా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. గురువారం బీసీసీఐ రివ్యూ మీటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశం అనంతరం బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను వెల్లడించిన ఆయన.. వైభవ్ సూర్యవంశీ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు.
వివరాలు
'వైభవ్ భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి'
'15 ఏళ్ల కుర్రాడిని అంతర్జాతీయ క్రికెట్‌లోకి తీసుకొచ్చినందుకు బీసీసీఐ గర్వపడుతోంది. వైభవ్ సూర్యవంశీ తన సత్తా ఏంటో ఇప్పటికే అభిమానులకు చూపించాడు.
ఇకపై కూడా అతడు ఇదే విధంగా సరైన మార్గంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.
కొన్ని మ్యాచులకు మాత్రమే పరిమితం కాకుండా.. సుదీర్ఘమైన కెరీర్‌ను నిర్మించుకోవాలి. అందుకోసం భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్‌ను వైభవ్ సూర్యవంశీ ఆదర్శంగా తీసుకోవాలి.
అంతర్జాతీయ కెరీర్‌లో అతడు వేసే ప్రతి అడుగును అన్ని కోణాల్లోనూ నిశితంగా గమనిస్తూనే ఉంటాం. వైభవ్ భవిష్యత్తుపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించింది'' అని దేవజిత్ సైకియా వెల్లడించారు.
వివరాలు
సఫారీలతో వన్డే సిరీస్?
ఇదిలా ఉండగా.. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనుంది. దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికా జట్టుతో వన్డే సిరీస్ ఆడితే బాగుంటుందనేది భారత జట్టు ఆలోచనగా తెలుస్తోంది.
ఇదే విషయంపై భారత జట్టు మేనేజ్‌మెంట్ దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రపంచకప్‌కు సన్నాహకంగా జరగనున్న ఈ వన్డే సిరీస్‌లో కనీసం నాలుగు నుంచి ఆరు మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
వివరాలు
ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పైనా ఫోకస్
మరోవైపు భారత ఆటగాళ్ల ఫిట్‌నెస్ విషయంలో బీసీసీఐ ఇకపై మరింత కఠినంగా వ్యవహరించనుంది.
ఆటగాళ్ల ఫిట్‌నెస్ అంశం గురువారం జరిగిన రివ్యూ మీటింగ్‌లో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం.
అంతర్జాతీయ క్రికెట్‌లో వరుస మ్యాచ్‌లు, సిరీస్‌ల నేపథ్యంలో ఆటగాళ్లు పూర్తి ఫిట్‌నెస్‌తో అందుబాటులో ఉండేలా బోర్డు ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.