LOADING...
Shreyas Iyer: శ్రేయస్‌కు శస్త్రచికిత్స జరగలేదు.. అయ్యర్‌ ఆరోగ్యంపై బీసీసీఐ అప్‌డేట్
శ్రేయస్‌కు శస్త్రచికిత్స జరగలేదు.. అయ్యర్‌ ఆరోగ్యంపై బీసీసీఐ అప్‌డేట్

Shreyas Iyer: శ్రేయస్‌కు శస్త్రచికిత్స జరగలేదు.. అయ్యర్‌ ఆరోగ్యంపై బీసీసీఐ అప్‌డేట్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2025
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెటర్‌ శ్రేయస్ అయ్యర్‌ తీవ్ర గాయంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన శ్రేయస్‌కి ప్లీహానికి గాయమవడంతో అంతర్గత రక్తస్రావం అయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ కారణంగా అతడిని వెంటనే ఐసీయూలో చేర్చగా, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని బీసీసీఐ స్పష్టం చేసింది. క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం, వైద్యులు మొదట శ్రేయస్‌కు శస్త్రచికిత్స అవసరం ఉంటుందని భావించినప్పటికీ, అనంతరం సర్జరీ లేకుండా ప్రత్యేక వైద్య విధానం ద్వారా రక్తస్రావాన్ని నియంత్రించగలిగారు. వైద్యుల సూచన మేరకు శ్రేయస్ కనీసం ఎనిమిది వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి.

వివరాలు 

డాక్టర్ రిజ్వాన్ పర్యవేక్షణలో చికిత్స

తాజాగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా శ్రేయస్ ఆరోగ్యంపై తాజా వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. "శ్రేయస్‌ చాలా బాగున్నాడు. ఊహించినదానికంటే వేగంగా కోలుకుంటున్నాడు. సిడ్నీ ఆసుపత్రిలోనే జట్టు వైద్యుడు డాక్టర్ రిజ్వాన్ పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. పూర్తిగా కోలుకోవడానికి ఎనిమిది వారాలు పట్టొచ్చని అనుకుంటున్నాం. కానీ, అతడి రికవరీ వేగం చూస్తే మరింత త్వరగానే తిరిగి మైదానంలో కనిపించవచ్చని అనిపిస్తోంది. ప్రస్తుతం అతడిని ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చాం. గాయం తీవ్రంగానే ఉన్నా, ప్రమాదం పూర్తిగా తప్పించుకున్నాడు," అని తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో వస్తున్న శస్త్రచికిత్స జరిగినట్లు ఉన్న వార్తలను ఆయన ఖండించారు.

వివరాలు 

 కొంత కాలం ఆసుపత్రిలోనే.. 

"శ్రేయస్‌కు ఎలాంటి సర్జరీ జరగలేదు. అంతర్గత రక్తస్రావం ఆగేందుకు భిన్నమైన వైద్య విధానం చేపట్టాం. అందువల్ల అతడు వేగంగా కోలుకుంటున్నాడు. సాధారణంగా ఇలాంటి గాయాల తర్వాత కనీసం ఒక వారం ఆసుపత్రిలో ఉండాలి. శ్రేయస్‌ కూడా వేగంగా కోలుకుంటున్నప్పటికీ, కొంత కాలం ఆసుపత్రిలోనే ఉంటాడు," అని సైకియా వివరించారు. ఆస్ట్రేలియాలో మూడో వన్డే సందర్భంగా శ్రేయస్ క్యాచ్ ప్రయత్నంలో గాయపడి మైదానంలోనే నొప్పితో విలవిల్లాడిపోయిన అతడిని ఆసుపత్రిలో చేర్చారు. ఇప్పటికే శ్రేయస్‌ కుటుంబసభ్యులు ఆస్ట్రేలియాకు పయనమైన సంగతి తెలిసిందే.