BCCI: భారత క్రికెట్ భవిష్యత్తుకు బీసీసీఐ కొత్త నియామకాలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్‌లో నైపుణ్యాభివృద్ధి, కోచింగ్ ప్రమాణాలు, పనితీరు విశ్లేషణను మరింత బలోపేతం చేసే దిశగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) కోసం పలు కోచింగ్, పెర్ఫార్మెన్స్‌కు సంబంధించిన పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని స్థాయిల్లో హై-పెర్ఫార్మెన్స్ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడమే ఈ నియామకాల ప్రధాన లక్ష్యమని బీసీసీఐ స్పష్టం చేసింది. ఖాళీగా ఉన్న పోస్టుల్లో రెండు బ్యాటింగ్ కోచ్‌ల స్థానాలున్నాయి.
Details
బౌలింగ్ కోచ్ పోస్టులకు భర్తీకి గ్రీన్ సిగ్నల్
జాతీయ సీనియర్ జట్టు, ఇండియా-ఏ, వయో విభాగాల జట్లు, అలాగే రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్‌లకు చెందిన ఆటగాళ్ల వరకు అన్ని స్థాయిల బ్యాటర్ల నైపుణ్యాలను మెరుగుపరచడం వీరి ప్రధాన బాధ్యతగా ఉంటుంది. హెడ్ క్రికెట్ కోచ్, జాతీయ కోచ్‌లు, సెలక్టర్లతో సమన్వయం చేసుకుంటూ బ్యాటింగ్ ప్రతిభను గుర్తించి, వారిని తీర్చిదిద్దాల్సి ఉంటుంది. ప్రత్యేక శిక్షణా ప్రోగ్రామ్‌లను రూపొందించడం, ఆటగాళ్ల ప్రదర్శనను నిరంతరం పర్యవేక్షించడం కూడా వీరి విధుల్లో భాగమే. అదేవిధంగా మూడు ఫాస్ట్ బౌలింగ్ కోచ్ పోస్టులను కూడా బీసీసీఐ భర్తీ చేయనుంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిక్షణ పొందే ఫాస్ట్ బౌలర్ల సాంకేతిక, వ్యూహాత్మక, శారీరక నైపుణ్యాలను మెరుగుపరచడం వీరి ప్రధాన బాధ్యత.
Details
పురుషులకు మూడు పోస్టులు
బౌలర్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్, ప్రతిభావంతుల గుర్తింపు, జాతీయ కోచింగ్ సిబ్బందితో సమన్వయంతో పని చేయడం వంటి కీలక బాధ్యతలు కూడా ఈ కోచ్‌లకు అప్పగించనున్నారు. ఇవే కాకుండా నాలుగు ఫీల్డింగ్ కోచ్ పోస్టులకు కూడా దరఖాస్తులను ఆహ్వానించారు. వీటిలో మూడు పోస్టులు పురుషుల విభాగానికి, ఒక పోస్టు మహిళల విభాగానికి కేటాయించారు. ఆటగాళ్ల చురుకుదనం, క్యాచింగ్, త్రోయింగ్ వంటి ఫీల్డింగ్ ప్రమాణాలను మెరుగుపరచడంలో ఈ కోచ్‌లు కీలక పాత్ర పోషించనున్నారు. అలాగే ఒక పెర్ఫార్మెన్స్ అనలిస్ట్ పోస్టును కూడా భర్తీ చేయనున్నారు. మ్యాచ్‌ల విశ్లేషణ, శిక్షణ డేటా, స్పోర్ట్స్ సైన్స్‌కు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించి, ఆటగాళ్ల పనితీరు మెరుగుదలకు అవసరమైన వ్యూహాత్మక నిర్ణయాల్లో ఈ అనలిస్ట్ సహకరించనున్నారు.
Details
5 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలి
ఈ అన్ని పోస్టులు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రంగా పనిచేస్తాయి. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ సూచించింది. అందిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం, షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను వ్యక్తిగత ఇంటర్వ్యూలకు పిలవనున్నట్లు బోర్డు వెల్లడించింది.