Asia Cup: నఖ్వీ ద్వంద్వ హోదాపై బీసీసీఐ ఆగ్రహం.. ఏంచేయనుందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI),పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మధ్య వివాదం మరింత ముదురుతోంది. పీసీబీ చైర్మన్‌గా, అలాగే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) పై బీసీసీఐ తీవ్ర ఆక్షేపణలు చేస్తోంది. ఈ ద్వంద్వ హోదా అంశాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) వద్ద అధికారికంగా ప్రస్తావించే దిశగా భారత బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
ద్వంద్వ పాత్రపై బీసీసీఐ అభ్యంతరం..
ప్రస్తుతం మొహ్సిన్ నఖ్వీ పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా కొనసాగుతూ, అదే సమయంలో పీసీబీ ఛైర్మన్‌గా, ఏసీసీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపడుతున్నారు. ఒకేసారి రాజకీయ హోదా, క్రికెట్ పరిపాలనా పదవిని నిర్వహించడం ఐసీసీ అమలు చేస్తున్న గవర్నెన్స్ నియమాలకు విరుద్ధమని బీసీసీఐ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో నఖ్వీ రెండు పదవుల్లో ఏదో ఒకదాన్ని విడిచిపెట్టాలి అనే డిమాండ్‌ను ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో అధికారికంగా నమోదు చేయడానికి బీసీసీఐ సిద్ధమైంది. ఈ ప్రతిపాదనకు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) కూడా భారత్‌కు మద్దతు ఇవ్వనున్నట్లు సమాచారం.
వివరాలు
ఆసియా కప్ ట్రోఫీ వివాదం..
బీసీసీఐ ప్రస్తావించబోయే కీలక అంశాల్లో ఆసియా కప్ 2025 ఫైనల్ తర్వాత జరిగిన ట్రోఫీ వివాదం ముఖ్యం. ఆటోర్నీలో భారత్ విజయం సాధించినప్పుడు,భారత ఆటగాళ్లు రాజకీయ ఉద్రిక్తతల కారణంగా నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి నిరాకరించారు.దీంతో నఖ్వీ ట్రోఫీని ఇతరులకు అందించకుండా,తనతోపాటు ఏసీసీ కార్యాలయానికి తీసుకెళ్లారని,భారత జట్టుకు అధికారికంగా ట్రోఫీ ఇవ్వలేదని బీసీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నఖ్వీ స్వయంగా భారతజట్టుకు ట్రోఫీ అందించాలని పట్టుబడుతుండగా,బీసీసీఐ ఆ ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించింది. ట్రోఫీని త్వరగా అప్పగించకపోతే ఐసీసీ వద్దకు వెళ్తామని హెచ్చరించింది. సమాచారం ప్రకారం ఆసియాకప్ ట్రోఫీ ఇంకా ఏసీసీ ప్రధానకార్యాలయంలోనే ఉందని తెలిసింది. రాబోయే ఐసీసీసమావేశం బీసీసీఐ-పీసీబీ మధ్య మరోసారి తీవ్రమైన మాటల యుద్ధానికి వేదిక కానుందని భావిస్తున్నారు.