Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ హెల్త్ అప్‌డేట్‌ను విడుదల చేసిన బీసీసీఐ
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ వన్డేలో భారత స్టార్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. అలెక్స్ కారీ క్యాచ్ కోసం వెనుకకు పరుగెత్తినప్పుడు బ్యాలెన్స్ కోల్పోయి నేలపై బలంగా పడిపోయాడు. ఈ ఘటనలో కడుపు భాగానికి గాయం కావడంతో అతని ప్లీహం దెబ్బతినడమే కాక, అంతర్గత రక్తస్రావం కూడా జరిగింది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో వెంటనే శ్రేయాస్‌ను సిడ్నీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనను వెంటనే ఐసీయూలో చేర్చి అత్యవసర చికిత్స అందించారు. దాదాపు కొన్ని రోజుల పాటు ఐసీయూలోనే వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. గాయం తీవ్రత కారణంగా వైద్య బృందం పూర్తి విశ్రాంతి అవసరమని సూచించింది.
Details
ఆస్పత్రి నుంచి శ్రేయస్ అయ్యర్ డిశ్చార్జ్
ఈ ఘటన అక్టోబర్ 25, 2025న సిడ్నీ వన్డేలో చోటుచేసుకుంది. మ్యాచ్ సమయంలో ఎడమ పక్కటెముక దిగువ భాగంలో గాయమై, వెంటనే శ్రేయాస్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారని అప్పట్లో బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. తాజాగా బీసీసీఐ మరో అప్‌డేట్ విడుదల చేసింది. శ్రేయాస్ అయ్యర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటికీ, ఇంకా సిడ్నీలోనే ఉంటారని వెల్లడించింది. పూర్తి ఆరోగ్యంగా కోలుకునే వరకు ఆయనకు వైద్య బృందం పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపింది. శ్రేయాస్‌కు చికిత్స అందించిన వైద్య బృందానికి బీసీసీఐ ధన్యవాదాలు తెలిపింది. అభిమానులు కూడా సోషల్ మీడియాలో శ్రేయాస్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.