ODI World Cup : బీసీసీఐ కీలక నిర్ణయం.. ముంబై, దిల్లీ నగరాల్లో జరిగే మ్యాచుల్లో 'నో ఫైర్ వర్క్స్'
వన్డే వరల్డ్ కప్ 2023 కీలక దశకు చేరుకుంటోంది. ఈ తరుణంలో బీసీసీఐ (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీలో ఏదైనా జట్టు మ్యాచు గెలిచిన తర్వాత స్టేడియంలో టపాసులను పేల్చడం అనవాయితీ. అదే విధంగా మ్యాచ్ మధ్యలో అభిమానుల కోసం లైటింగ్ షో కూడా ఏర్పాటు చేస్తారు. అయితే ఈ లైటింగ్ షో వల్ల పెద్దగా నష్టం లేదు. అయితే కాలుష్యం అధికంగా ఉండే దిల్లీ, ముంబాయి ప్రాంతాల్లో ఈ టపాసులను పేల్చడం వాతావరణానికి హానీ చేసినట్లే అని పర్యావరణ ప్రేమికులు వాపోతున్నారు. దీంతో ఈ రెండు నగరాల్లోని మైదానాల్లో జరిగే మ్యాచుల సందర్భంగా టపాసులను కాల్చడాన్ని నిషేధిస్తున్నట్లు తాజాగా బీసీసీఐ ప్రకటించింది.
దిల్లీ, ముంబాయి మైదానాల్లో టపాసులు నిషేధం
ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జైషా కీలక ప్రకటన చేశారు. వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని, ఇదే విషయాన్ని ఐసీసీ(ICC) దగ్గరకి తీసుకెళ్లగా వారు కూడా అంగీకరించారని జైషా తెలిపాడు. దీంతో ముంబాయి, దిల్లీ మైదానాల వద్ద టపాసులను కాల్చడం లేదని, వాతావరణ సమస్యలపై బీసీసీఐ కూడా తన వంతు కృషి చేస్తుందన్నారు. ఇక ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌ను అద్భుతంగా నిర్వర్తించడం వల్ల భవిష్యత్తులో క్రికెట్‌కు అదనపు ప్రయోజనం చేకూరుతుందన్నారు. అదే విధంగా అభిమానులు, అటగాళ్లు, ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని, అందులో భాగంగానే ఫైర్ వర్క్స్ ను నిలిపివేస్తున్నామని వెల్లడించారు.