LOADING...
Jasprit bumrah: బుమ్రాను 9 టెస్టుల్లో ఆడించాలనే దిశగా బీసీసీఐ ప్రణాళిక!
బుమ్రాను 9 టెస్టుల్లో ఆడించాలనే దిశగా బీసీసీఐ ప్రణాళిక!

Jasprit bumrah: బుమ్రాను 9 టెస్టుల్లో ఆడించాలనే దిశగా బీసీసీఐ ప్రణాళిక!

వ్రాసిన వారు Moogati Shabari
Apr 23, 2026
01:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకవైపు ఐపీఎల్ 2026 సీజన్ కొనసాగుతుండగా, మరోవైపు భారత క్రికెట్ నియంత్రణ మండలి అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్ రూపొందించడంపై దృష్టి సారించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ నాలుగో దశ ఫైనల్‌కి ఎలా చేరుకోవాలన్న అంశంపై లోతుగా పరిశీలన సాగుతోందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సీజన్‌లో భారత్ తొమ్మిది టెస్టులు ఆడగా, వాటిలో నాలుగు విజయాలు సాధించి, మరో నాలుగు మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. వచ్చే ఏడాది మార్చి వరకు ఇంకా తొమ్మిది టెస్టులు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ ఆరో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఒక్క పరాజయం కూడా అవకాశాలను దెబ్బతీసే పరిస్థితి ఉంది.

వివరాలు

బీసీసీఐ కీలక వ్యూహం..

ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక వ్యూహం సిద్ధం చేస్తోందని సమాచారం. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను మిగిలిన అన్ని టెస్టుల్లోనూ వినియోగించాలని యోచిస్తోంది. అయితే ఇది సవాళ్లతో కూడుకున్న నిర్ణయం. ఎందుకంటే ముందున్న షెడ్యూల్‌లో వన్డే ప్రపంచకప్, తర్వాతి ఏడాది టీ20 ప్రపంచకప్, అలాగే లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ వంటి ప్రధాన ఈవెంట్లు ఉన్నాయి. దీంతో బుమ్రా పనిభారం సమతుల్యం చేయడం బోర్డుకు కష్టతరంగా మారింది. అతడిపై అధిక ఒత్తిడి పెరిగితే గాయాల ప్రమాదం ఉంది, అది జట్టుకు పెద్ద నష్టాన్ని కలిగించవచ్చు. భారత్ న్యూజిలాండ్, శ్రీలంక జట్లతో కలిపి నాలుగు టెస్టులు ఆడనుండగా, వాటిలో బుమ్రా పాల్గొనే అవకాశం ఉంది.

వివరాలు

వారికి విశ్రాంతి..

అయితే ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు అతడిని పూర్తి స్థాయిలో సిద్ధం చేయడం ఒక పెద్ద సవాలుగా భావిస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని వన్డే సిరీస్‌లు కూడా షెడ్యూల్‌లో ఉన్నాయి. అయినప్పటికీ, అతడికి విశ్రాంతి ఇవ్వాలనే దిశగా సెలక్టర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఇక అఫ్గానిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టులో కూడా బుమ్రాతో పాటు కీలక ఆటగాళ్లను బరిలోకి దింపాలని బోర్డు భావిస్తోంది. ఈ మ్యాచ్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగం కాకపోయినా, ప్రాక్టీస్ పరంగా ఉపయోగపడుతుందని చూస్తోంది. అయితే ఈ అంశంపై తుది నిర్ణయం ఐపీఎల్ ముగిసే సమయానికి వెలువడే అవకాశముందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.

Advertisement