LOADING...
T20 World Cup 2026: క్రీజులో ఉంటే చాలు మ్యాచ్‌ గమనమే మార్చే బ్యాటింగ్‌ తుపాన్లు వీరే..
క్రీజులో ఉంటే చాలు మ్యాచ్‌ గమనమే మార్చే బ్యాటింగ్‌ తుపాన్లు వీరే..

T20 World Cup 2026: క్రీజులో ఉంటే చాలు మ్యాచ్‌ గమనమే మార్చే బ్యాటింగ్‌ తుపాన్లు వీరే..

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 04, 2026
10:04 am

ఈ వార్తాకథనం ఏంటి

బాదుడు, ఉతుకుడు, విధ్వంసం... ఈ పదాలన్నీ వాళ్ల ఆట ముందు చిన్నబోతాయి. వాళ్లు బ్యాటింగ్‌ చేస్తుంటే చూస్తున్నది ప్రత్యక్ష ప్రసారమా లేక హైలైట్సా అనే అనుమానం కలుగుతుంది. కొద్ది ఓవర్లలోనే మ్యాచ్‌ దిశను పూర్తిగా మార్చేసే సత్తా వాళ్లది. క్రీజులో ఉండేది కాసేపే అయినా స్టేడియంలో పరుగుల వర్షం కురుస్తుంది. అభిమానుల అరుపులతో హోరెత్తుతుంది. అలాంటి విధ్వంసక పవర్‌ హిట్టర్లు ఈసారి టీ20 ప్రపంచకప్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఆ ఆటగాళ్లెవరో ఇప్పుడు చూద్దాం.

వివరాలు 

షేక్‌ చేసేస్తాడు - అభిషేక్‌ శర్మ

ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో ఆడుతున్న బ్యాటర్లలో అత్యంత ఆకర్షణ ఉన్న ఆటగాడు అభిషేక్‌ శర్మ నిలుస్తున్నాడు. నేటి నంబర్‌వన్‌ టీ20 బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అతడు గత కొన్నేళ్లుగా తన దూకుడు ఆటతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. తొలి బంతి నుంచే దాడి చేయడమే అతడి శైలి. సిక్స్‌తోనే ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సందర్భాలు అభిషేక్‌ కెరీర్‌లో ఎన్నో ఉన్నాయి. నీళ్లు తాగినంత ఈజీగా బంతిని స్టాండ్స్‌లోకి పంపించే ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ టీ20ల్లో భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మాజీ స్టార్‌ యువరాజ్‌ సింగ్‌ మార్గదర్శకత్వంలో తన ఆటను మెరుగుపరుచుకున్న అభిషేక్‌.. 2024లో టీ20ల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి టీమ్‌ ఇండియాకు ప్రధాన ఆయుధంగా మారాడు.

వివరాలు 

షేక్‌ చేసేస్తాడు - అభిషేక్‌ శర్మ

పవర్‌ప్లేలో అతడు చూపించే దూకుడుతో మ్యాచ్‌ స్వరూపమే మారిపోతుంది. సెహ్వాగ్‌ను గుర్తు చేసే శైలిలో క్రీజులో ఉన్నంతసేపూ బలమైన ముద్ర వేస్తాడు. ఆరంభంలో అతడు వేస్తున్న పునాది వల్ల తర్వాతి బ్యాటర్లకు స్వేచ్ఛగా ఆడే అవకాశం లభిస్తోంది. ఇప్పటివరకు 38 టీ20ల్లో 194.74 స్ట్రైక్‌రేట్‌తో 1297 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 8 అర్ధసెంచరీలు ఉన్నాయి. అవసరమైతే లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్‌తోనూ ఉపయోగపడతాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ ఫామ్‌ కొనసాగిస్తూ మూడో మ్యాచ్‌లో 14 బంతుల్లోనే అర్ధసెంచరీ బాదాడు. ఇలాంటి జోరులో ఉన్న అభిషేక్‌ ప్రపంచకప్‌లో ఎలా చెలరేగుతాడో చూడాల్సిందే.

Advertisement

వివరాలు 

బేబీ డివిలియర్స్‌ - బ్రెవిస్

దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ను '360 డిగ్రీల బ్యాటర్‌'గా పిలుస్తారు. మైదానంలోని ప్రతి కోణంలోనూ షాట్లు ఆడగలగడమే ఆ పేరు వెనుక కారణం. ఏబీ రిటైరైనా అతడి శైలిని తలపించే మరో ఆటగాడు ఇప్పుడు వెలుగులోకి వచ్చాడు. అతడే డెవాల్డ్‌ బ్రెవిస్‌. మైదానమంతా షాట్లు ఆడగల సామర్థ్యంతో ఈ యువకుడు ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించాడు. 2022 అండర్‌-19 ప్రపంచకప్‌తో ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ అంతర్జాతీయ క్రికెట్‌ వేదికపై గుర్తింపు పొందాడు. ఆ టోర్నీలో 6 మ్యాచ్‌ల్లో 506 పరుగులు చేసి 'ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ'గా నిలిచాడు. అదే ఏడాది ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ అతడిని రూ.3కోట్లకు కొనుగోలు చేసింది. తర్వాతి సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడాడు.

Advertisement

వివరాలు 

బేబీ డివిలియర్స్‌ - బ్రెవిస్

2023లో దక్షిణాఫ్రికా జట్టుకు టీ20ల్లో అరంగేట్రం చేసిన బ్రెవిస్‌.. ఈ ఏడాది ఎస్‌ఏ టీ20 లీగ్‌లో 12 మ్యాచ్‌ల్లో 370 పరుగులు చేసి అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఎంతటి ఒత్తిడి పరిస్థితుల్లోనైనా తన సహజ దూకుడు ఆటను వదలడు. అందుకే ఈ ప్రపంచకప్‌లో అతడిపై దక్షిణాఫ్రికా పెద్ద ఆశలే పెట్టుకుంది.

వివరాలు 

ప్రత్యర్థులు జాగ్రత్త - సాల్ట్

ఫిల్‌ సాల్ట్‌ ఆట ఐపీఎల్‌ను ఫాలో అయ్యే అభిమానులకు కొత్తది కాదు. తొలి బంతి నుంచే ధనాధన్‌ షాట్లతో విరుచుకుపడే ఈ ఇంగ్లాండ్‌ కుడిచేతి వాటం బ్యాటర్‌ స్పిన్‌,పేస్‌ అనే తేడా లేకుండా బౌలర్లపై విరుచుకుపడతాడు. గత సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టైటిల్‌ సాధించడంలో సాల్ట్‌ కీలకంగా నిలిచాడు. ఆ సీజన్‌లో అతడు 12 మ్యాచ్‌ల్లో 387 పరుగులు చేశాడు. 2022 టీ20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన ఇంగ్లాండ్‌ జట్టులో సభ్యుడైన సాల్ట్‌ ఈసారి కూడా కీలక పాత్ర పోషించనున్నాడు.

వివరాలు 

ప్రత్యర్థులు జాగ్రత్త - సాల్ట్

శ్రీలంకతో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో గాయపడినప్పటికీ, కోలుకుని ప్రపంచకప్‌లో బరిలోకి దిగుతాడని ఇంగ్లాండ్‌ భావిస్తోంది. అతడు జట్టులో ఉంటే ప్రత్యర్థులు అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇప్పటివరకు ఇంగ్లాండ్‌ తరఫున 52 టీ20లు ఆడిన సాల్ట్‌ 1587 పరుగులు చేశాడు. అందులో 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీలు ఉన్నాయి.

వివరాలు 

ఆసీస్‌ మొనగాడు - ట్రావిస్‌ హెడ్

2023లో భారత్‌ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌, వన్డే ప్రపంచకప్‌ గెలవలేకపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకడు ట్రావిస్‌ హెడ్‌. ఫార్మాట్‌ ఏదైనా సరే మ్యాచ్‌లను ఒంటిచేత్తో తిప్పేసే సత్తా ఈ ఆస్ట్రేలియా ఓపెనర్‌ది. ఇటీవల టీ20ల్లో అతడి ప్రదర్శన అంతగా ఆకట్టుకోకపోయినా, పెద్ద టోర్నీలకు వచ్చేసరికి మరో హెడ్‌ బయటకు వస్తాడు. ఒత్తిడి పరిస్థితుల్లోనూ అదరగొట్టే 'క్లచ్‌ ప్లేయర్‌'గా పేరు తెచ్చుకున్నాడు.

వివరాలు 

ఆసీస్‌ మొనగాడు - ట్రావిస్‌ హెడ్

పవర్‌ప్లేలో వికెట్లు పడినా వెనక్కి తగ్గకుండా తన సహజ దూకుడు ఆటతో స్కోరును పరుగులపెట్టిస్తాడు. ప్రత్యర్థులు తేరుకునేలోపే మ్యాచ్‌ను తన జట్టు వైపు మళ్లిస్తాడు. ఔటయ్యేలోపు చేయాల్సిన నష్టాన్ని చేసేసే బ్యాటర్‌ హెడ్‌. ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్‌ సిరీస్‌లో 10 ఇన్నింగ్స్‌ల్లో 629 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అదే ఫామ్‌ను టీ20 ప్రపంచకప్‌లోనూ కొనసాగిస్తే మిగిలిన జట్లకు తలనొప్పే.

వివరాలు 

పరుగుల తుపాన్‌ - ఫిన్‌ అలెన్

భారత్‌తో తిరువనంతపురంలో జరిగిన అయిదో టీ20లో న్యూజిలాండ్‌ ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ చూపిన విధ్వంసాన్ని అభిమానులు ఇప్పటికీ మరిచిపోలేదు. 272 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్‌ 220 పైగా పరుగులు చేయగలిగిందంటే అందులో అలెన్‌ దూకుడే ప్రధాన కారణం. సిక్స్‌లను అలవోకగా బాదేసే ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ ఒకసారి కుదురుకుంటే క్షణాల్లోనే మ్యాచ్‌ గమనాన్ని మార్చేస్తాడు.

వివరాలు 

పరుగుల తుపాన్‌ - ఫిన్‌ అలెన్

2018 అండర్‌-19 ప్రపంచకప్‌లో 338 పరుగులు చేసి తన ప్రతిభను చాటుకున్న అలెన్‌.. కెన్యాపై కేవలం 19 బంతుల్లోనే అర్ధసెంచరీ బాదాడు. 2024లో పాకిస్థాన్‌తో జరిగిన టీ20లో 48 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అదే ఇన్నింగ్స్‌లో 16 సిక్స్‌లు బాది ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌ల రికార్డును సమం చేశాడు. తాజాగా బిగ్‌బాష్‌ లీగ్‌లో 11 మ్యాచ్‌ల్లో 466 పరుగులు చేసి పెర్త్‌ స్కార్చర్స్‌ టైటిల్‌ గెలవడంలో కీలకంగా నిలిచాడు. అదే ఊపును ప్రపంచకప్‌లోనూ కొనసాగించాలని చూస్తున్నాడు. ఇప్పటివరకు 53 టీ20ల్లో 2 సెంచరీలు, 6 అర్ధసెంచరీలతో 1365 పరుగులు అతడి ఖాతాలో ఉన్నాయి.

Advertisement