
IPL 2026: ఐపీఎల్ 2026కు ముందే బిగ్ ప్లాన్.. కెప్టెన్ల మార్పుకు సిద్ధమైన మూడు జట్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) 19వ సీజన్ వచ్చే మార్చి-ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు ముందే జట్లు బీసీసీఐకి తమ నిలుపుదల జాబితాలను అందజేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 1-2 కాదు, మూడు ఫ్రాంచైజీలు తమ కెప్టెన్లను మార్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత ఫార్మ్‌లో విఫలమైన ఆటగాళ్లను పక్కన పెట్టి, కొత్త రక్తాన్ని జట్టులోకి తీసుకోవాలని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో కెప్టెన్సీపై కూడా మార్పులు జరగనున్నాయని తెలుస్తోంది.
Details
రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక మార్పులు
ఐపీఎల్ 2026కి ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టులో పెద్ద మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కెప్టెన్‌గా ఉన్న సంజు శాంసన్ తన పదవిని కోల్పోవచ్చని ప్రచారం సాగుతోంది. అతని పేలవ ప్రదర్శన కారణంగానే ఫ్రాంచైజీ అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించాలని భావిస్తోందని సమాచారం. మరోవైపు సంజు స్వయంగా కూడా ఫ్రాంచైజీ నుంచి విడుదల కావాలనే అభిప్రాయం వ్యక్తం చేశాడని వార్తలు వస్తున్నాయి. 2021లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన సంజు, ఇప్పటివరకు 67 మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు. అందులో 33 విజయాలు, 32 ఓటములు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో ఫ్రాంచైజీతో అతని సంబంధాలు దెబ్బతినడంతో, విడిపోవాలనే నిర్ణయానికి ఇరువురు రాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Details
KKR జట్టులో నాయకత్వ మార్పు?
షారుఖ్ ఖాన్‌కి చెందిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కూడా IPL 2026లో కెప్టెన్సీ మార్పుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. IPL 2025లో జట్టు ప్రదర్శన నిరాశపరిచింది. శ్రేయాస్ అయ్యర్ విడుదలైన తర్వాత అజింక్య రహానెను కెప్టెన్‌గా నియమించినా, జట్టు కేవలం 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. జట్టు బ్యాటింగ్ విభాగం బలహీనంగా ఉందని, దాని ప్రభావం ఫలితాలపై పడిందని రహానే స్వయంగా అంగీకరించాడు. ఈ పరిస్థితుల్లో రహానేపై విమర్శలు పెరిగి, కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. రాబోయే సీజన్‌కు ముందు KKR కొత్త కెప్టెన్‌ను ప్రకటించవచ్చని వర్గాలు చెబుతున్నాయి.
Details
CSKలోనూ మార్పులు - రుతురాజ్ భవిష్యత్తు అనిశ్చితం
IPLలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన చైన్నై సూపర్ కింగ్స్ (CSK) కూడా మార్పులకు సిద్ధమవుతోంది. IPL 2025లో జట్టు ప్రదర్శన పూర్తిగా నిరాశపరిచింది. ఆరంభ మ్యాచ్‌ల తర్వాత రుతురాజ్ గైక్వాడ్ గాయపడడంతో, మళ్లీ ఎంఎస్ ధోని జట్టును నడిపించాల్సి వచ్చింది. అయినప్పటికీ, CSK 14 మ్యాచ్‌లలో 10 ఓటములు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచింది. ఈ పరిస్థితుల్లో, రాబోయే సీజన్‌కు ముందు రుతురాజ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 2024 నుంచి 2025 వరకు అతను మొత్తం 19 మ్యాచ్‌లలో జట్టును నడిపి, 8 విజయాలు సాధించగా, మిగతా మ్యాచ్‌లలో పరాజయాల పాలయ్యాడు.