Ashes Series: ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. ప్రధాన పేసర్ ఔట్.. మూడో టెస్టుకు సిద్ధమైన కమిన్స్ సేన!
ఈ వార్తాకథనం ఏంటి
యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ కష్టాలు మరింతగా ముదురుతున్నాయి. ఇప్పటికే వరుసగా రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడిపోయిన బెన్ స్టోక్స్ నాయకత్వంలోని జట్టుకు మరో పెద్ద దెబ్బ తగిలింది. ప్రధాన పేసర్ మార్క్ వుడ్ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మోకాలి గాయం కారణంగా గబ్బా టెస్టుకు అందుబాటులో లేకపోయిన వుడ్ తిరిగి కోలుకోలేకపోవడంతో మిగతా మూడు టెస్టుల నుంచి తప్పుకున్నాడు. ఇదే సమయంలో సిరీస్‌లో 2-0తో పైచేయి సాధించిన ఆస్ట్రేలియా కూడా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ సేవలను కోల్పోయింది.
Details
ఇంగ్లండ్‌కు వరుసగా షాకులు
స్వదేశంలో భారత్‌తో సిరీస్‌ను సమం చేసిన ఇంగ్లండ్ యాషెస్ సిరీస్‌లో పూర్తిగా పతనమవుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ వైఫల్యాలు జట్టును తీవ్రంగా దెబ్బతీశాయి. అడిలైడ్ టెస్టుతో సిరీస్‌లో తిరిగి పోరాడాలనుకున్న ఇంగ్లండ్‌కు మార్క్ వుడ్ అందుబాటులో లేకపోవడం మరో భారీ నష్టం. గత ఏడాది నుంచి గాయాలతో సతమతమవుతున్న వుడ్ మోకాలి గాయం మళ్లీ తీవ్రంగా బయల్పడటంతో సిరీస్‌కు దూరమయ్యాడు. త్వరలోనే స్వదేశానికి వెళ్లి రిహాబిలిటేషన్‌లో చేరనున్న వుడ్‌ను ఇంగ్లండ్-వేల్స్ క్రికెట్ బోర్డు వైద్య బృందం పర్యవేక్షించనుంది. పెర్త్ టెస్టులో 11 ఓవర్లు వేసినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
Details
ఆస్ట్రేలియాకు కూడా గట్టి ఎదురుదెబ్బ
యాషెస్‌లో ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియాకు కూడా ఒక కీలక ఆటగాడిని కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. తొడకండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకోని జోష్ హేజిల్‌వుడ్‌ను మిగతా సిరీస్ నుంచి తప్పించారు. షెఫీల్డ్ షీల్డ్‌లో గాయం చెందిన హేజిల్‌వుడ్ మొదటి రెండు టెస్టులకు దూరమయ్యాడు. అడిలైడ్ కోసం సిద్ధంగా ఉంటాడని భావించినా, మరోసారి ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమవడంతో అతడికి విశ్రాంతిని ప్రకటించారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ నాటికి పూర్తిగా సిద్ధమవుతాడని కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ వెల్లడించాడు. అయితే, ఆస్ట్రేలియా అభిమానులకు మంచి వార్త కూడా ఉంది. గాయాల నుంచి కోలుకున్న ప్యాట్ కమిన్స్ అడిలైడ్ టెస్టులో ఆడేందుకు సిద్ధమయ్యాడు. డిసెంబర్ 17న జరగనున్న మూడో టెస్టులో అతడు జట్టును నడిపిస్తాడు.