Page Loader
ENG vs IND : ఇంగ్లాండ్‌ జట్టుకు బిగ్ షాక్‌.. గాయంతో షోయబ్ బషీర్ టెస్టు ఔట్!
ఇంగ్లాండ్‌ జట్టుకు బిగ్ షాక్‌.. గాయంతో షోయబ్ బషీర్ టెస్టు ఔట్!

ENG vs IND : ఇంగ్లాండ్‌ జట్టుకు బిగ్ షాక్‌.. గాయంతో షోయబ్ బషీర్ టెస్టు ఔట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 15, 2025
02:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

లార్డ్స్ వేదికగా భారత్‌తో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ గెలుపొందింది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆ జట్టు 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక నాలుగో టెస్టు మ్యాచ్ జూలై 23 నుంచి 27 వరకు మాంచెస్టర్‌లో జరగనుంది. ఈ టెస్టుకు ఇంకా ఎనిమిది రోజుల విరామం ఉన్నప్పటికీ, ఇంగ్లాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టెస్టు సిరీస్‌లో అదృష్టం మళ్లిన తరుణంలో, ఆ జట్టు ప్రధాన స్పిన్నర్ షోయబ్ బషీర్ గాయంతో మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. భారత తొలి ఇన్నింగ్స్ సమయంలో బషీర్ గాయపడ్డాడు. భారత్ ఇన్నింగ్స్‌లో 78వ ఓవర్ వేసే సమయంలో రవీంద్ర జడేజా ఆడిన స్ట్రెయిట్ షాట్‌ను అడ్డుకునే ప్రయత్నంలో అతడి ఎడమ చేతికి గాయమైంది.

Details

షోయబ్ బషీర్‌పై కెప్టెన్ ప్రశంసలు

వెంటనే బషీర్ నొప్పితో విలవిల్లాడుతూ మైదానాన్ని వదిలి వెళ్లాడు. అనంతరం స్కానింగ్ చేసిన వైద్యులు, అతడి ఎడమచేతి వేలు ఫ్రాక్చర్ అయినట్లు నిర్ధారించారు. గాయం ఉన్నప్పటికీ బషీర్ పోరాటపటిమ చూపించాడు. నొప్పిని తట్టుకొని ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేశాడు. అంతే కాకుండా భారత జట్టు చివరి వికెట్ పడగొట్టేందుకు మళ్లీ మైదానంలోకి వచ్చి బౌలింగ్ చేశాడు. సిరాజ్‌ను ఔట్ చేసి ఇంగ్లాండ్‌కు విజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు నిజమైన యోధుడని కొనియాడాడు. బషీర్ ఈ వారాంతంలో శస్త్ర చికిత్స చేయించుకోనున్నాడని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. దాంతో ఈ సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరమవుతున్నట్టు స్పష్టం చేసింది.